తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hindi Controversy | 'పానీపూరీ అమ్ముకోవడానికి హిందీ నేర్చుకోవాలా?'

Hindi controversy | 'పానీపూరీ అమ్ముకోవడానికి హిందీ నేర్చుకోవాలా?'

HT Telugu Desk HT Telugu

14 May 2022, 9:09 IST

google News
  • Hindi controversy | తమిళనాడులో మరోమారు హిందీ భాషపై వివాదం రాజుకుంది. హిందీ భాషపై ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'హిందీ మాట్లాడేవారు.. పానీపూరీలు అమ్ముకుంటున్నారు,' అని అన్నారు.

స్టాలిన్​తో పొన్ముడి
స్టాలిన్​తో పొన్ముడి (TWITTER)

స్టాలిన్​తో పొన్ముడి

Hindi controversy | దేశంలో హిందీ వర్సెస్​ ప్రాంతీయ భాషపై వివాదం కొనసాగుతున్న తరుణంలో.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కే పొన్ముడి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. 'పానీపూరీలు అమ్ముకునేందుకు హిందీ నేర్చుకోవాలా?' అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.

శుక్రవారం జరిగిన ఓ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు పొన్ముడి. ఈ క్రమంలో హిందీ భాషపై మాట్లాడారు.

"హిందీ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఎవరో అన్నారు. మీకు ఉద్యోగాలు వస్తున్నాయా మరి? మన కోయంబత్తూర్​లో చూడండి.. హిందీ మాట్లాడే వాళ్లు పానీపూరీలు అమ్ముకుంటున్నారు. పానీపూరీ దుకాణాల పెట్టుకుంటున్నారు. తమిళనాడులో మనకంటూ ఒక వ్యవస్థ ఉండాలి. రాష్ట్రంలో తమిళం అనేది ప్రాంతీయ భాష. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్​ కూడా ఉంది. హిందీని పొరపాటున జాతీయ భాషగా అని ఉంటారు. అంతే!" అని పొన్ముడి అన్నారు.

K Ponmudi | పొన్ముడి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత.. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.

"తమిళనాడు నుంచి చాలా మంది ఉద్యోగాల కోసం ఉత్తర భారతానికి వెళుతూ ఉంటారు. అలాగే ఉత్తర భారతం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ ఉద్యోగాలు లేకే ఇక్కడికి వస్తున్నారు అన్నది నా ఉద్దేశం," అని స్పష్టతనిచ్చారు పొన్ముడి.

వాస్తవానికి.. దేశంలోని ఏ భాషకి కూడా రాజ్యంగం.. 'జాతీయ భాష' అనే గుర్తింపును ఇవ్వలేదు. రాజ్యంగంలోని 8వ షెడ్యూల్​ ప్రకారం.. దేశంలో 22 'అధికార భాషలు' ఉన్నాయి. అధికారిక కార్యకలాపాల కోసం ఇంగ్లీష్​, హిందీని ఉపయోగించుకోవాలని మాత్రమే 1963 అధికారిక భాషల చట్టం చెబుతోంది.

తదుపరి వ్యాసం