Hindi controversy | 'హిందీ మాట్లాడలేకపోతే.. ఇండియాను విడిచి వెళ్లిపోండి'-amid hindi controversy up minister says hindustan is not a place for those who don t speak hindi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hindi Controversy | 'హిందీ మాట్లాడలేకపోతే.. ఇండియాను విడిచి వెళ్లిపోండి'

Hindi controversy | 'హిందీ మాట్లాడలేకపోతే.. ఇండియాను విడిచి వెళ్లిపోండి'

HT Telugu Desk HT Telugu
Apr 30, 2022 10:47 AM IST

ఉత్తర్​ప్రదేశ్​: హిందూస్థాన్​ అంటే హిందీ మాట్లాడే వారి ప్రాంతం అని, ఆ భాష రాకపోతే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఉత్తర్​ప్రదేశ్​ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది.

<p>సంజయ్​ నిషాద్​</p>
సంజయ్​ నిషాద్​ (PTI/file)

Hindi controversy | దేశంలో.. హిందీ వర్సెస్​ ప్రాంతీయ భాషల వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తూనే ఉంది. హిందీ, కన్నడ తారల మాటల యుద్ధంతో ఈ వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ సమయంలో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు.. ఉత్తరప్రదేశ్​కు చెందిన ఓ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష రాని వారు దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలన్నారు.

బీజేపీ మిత్రపక్షానికి చెందిన నిషాద్​ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సంజయ్​ నిషాద్​ ఈ వ్యాఖ్యాలు చేశారు.

"ఇండియాలో జీవించాలి అనుకుంటే.. హిందీని ప్రేమించాల్సిందే. మీకు హిందీ ఇష్టంలేకపోతే.. మీరు విదేశీయులతో సమానం. విదేశీ శక్తులతో మీకు సంబంధం ఉన్నట్టు. మాకు ప్రాంతీయ భాషలపై గౌరవం ఉంది. కానీ ఇది ఇండియా. అంటే 'హిందుస్థాన్​'. భారత రాజ్యాంగం ప్రకారం.. హిందుస్థాన్​ అంటే.. హిందీ మాట్లాడే ప్రజల ప్రాంతం," అని మీడియాకు వెల్లడించారు సంజయ్​ నిషాద్​.

అందుకే.. హిందీ మాట్లాడలేకపోత, ఇండియాను విడిచివెళ్లిపోవాలని సంజయ్​ నిషాద్​ సూచించారు.

"చట్టాల ప్రకారం దేశ జాతీయ భాష హిందీ. చట్టాన్ని ఉల్లంఘించే వారిని జైలులో పెట్టాలి. హిందీ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి.. దేశంలో అలజడులను సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారు," అని సంజయ్​ పేర్కొన్నారు.

వాస్తవానికి.. దేశంలోని ఏ భాషకి కూడా రాజ్యంగం.. 'జాతీయ భాష' అనే గుర్తింపును ఇవ్వలేదు. రాజ్యంగంలోని 8వ షెడ్యూల్​ ప్రకారం.. దేశంలో 22 'అధికార భాషలు' ఉన్నాయి. అధికారిక కార్యకలాపాల కోసం ఇంగ్లీష్​, హిందీని ఉపయోగించుకోవాలని మాత్రమే 1963 అధికారిక భాషల చట్టం చెబుతోంది.

రాజకీయ దుమారం..

Hindi vs regional languages | సంజయ్​ నిషాద్​ వ్యాఖ్యలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. మంత్రిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

"నాకు హిందీ అంటే ప్రేమ ఉంది. అది నా మాతృభాష. అదే సమయంలో.. తమ మాతృభాషను ప్రేమించే వారి పట్ల నాకు గౌరవం ఉంది. భాషల్లోని వైవిధ్యాల పట్ల మనం సంతోషంగా ఉండాలి. దేశంలోని పౌరులు ఎలాంటి భాషలు మాట్లాడినా.. వారు భారతీయులే అవుతారు. భారత రాజ్యాంగం.. అనేక భాషలకు గుర్తింపును ఇచ్చింది. మాతృభాషపై ఇష్టం ఉన్న వారు.. దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాము," అని ఎస్​పీ ప్రతినిధి అబ్దుల్​ హఫీజ్​ గాంధీ వెల్లడించారు.

దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, రైతు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. బీజేపీ, దాని మిత్రపక్షం హిందీ వ్యవహారంపై చర్చలు నడిపిస్తోందని బీఎస్​పీ నేత ఒకరు మండిపడ్డారు.

అయితే.. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం.. సంజయ్​ నిషాద్​ వ్యాఖ్యలను సమర్ధించకపోవడం గమనార్హం. హిందీ మాట్లాడలేకపోతే ఇండియాను విడిచిపెట్టి వెళ్లిపోవాలన్న మంత్రి వ్యాఖ్యలు తప్పు అని పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం