వాళ్లు హిందీ ఎందుకు మాట్లాడాలి.. సుదీప్‌కు బాలీవుడ్ సింగర్ సపోర్ట్
03 May 2022, 15:37 IST
- హిందీపై కన్నడ స్టార్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ మొదలుపెట్టిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ మాత్రం సుదీప్‌కు మద్దతు పలికేలా మాట్లాడాడు.
బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్
న్యూఢిల్లీ: హిందీ ఇక ఏమాత్రం జాతీయ భాష కాదని సుదీప్.. ఎందుకు కాదు ఎప్పుటికీ హిందీయే జాతీయ భాషగా ఉంటుందని అజయ్ దేవ్‌గన్.. అసలు హిందీ జాతీయ భాష అని ఎవరన్నారు? ఇండియాకు జాతీయ భాష అంటూ లేదని మధ్యలో కొందరు నెటిజన్లు.. ఇలా కొన్ని రోజులుగా ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కూడా దీనిపై స్పందించాడు.
హిందీ ఎక్కువగా మాట్లాడినంత మాత్రాన.. దానిని హిందీ మాట్లాడని వారిపై బలవంతంగా రుద్దకూడదని, అసలు రాజ్యాంగంలోనూ హిందీ జాతీయ భాష అని ఎక్కడా లేదని సోనూ అనడం విశేషం. "నాకున్న అవగాహన మేరకు హిందీ జాతీయ భాష అని రాజ్యాంగంలో రాయలేదు. నేను నిపుణలతోనూ ఈ విషయంపై మాట్లాడాను. దేశంలో హిందీ ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమే. కానీ అదే సమయంలో తమిళం ప్రపంచంలోనే ప్రాచీన భాష అన్న విషయం తెలుసా? సంస్కృతం, తమిళం మధ్య చర్చ జరిగినప్పుడు.. తమిళమే ప్రాచీన భాష అని ఎంతోమంది అన్నారు" అని సోనూ చెప్పాడు.
దేశంలో ఇప్పుడున్న సమస్యలు చాలవా.. కొత్తగా ఇలాంటి చర్చకు తెరతీసి ఎందుకు లేని సమస్యను సృష్టిస్తారు అని కూడా సోనూ ప్రశ్నించాడు. "భాషను ఇతరులపై రుద్దడం ద్వారా సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు. తమిళులైనా సరే హిందీ మాట్లాడాలని ఎలా అంటారు. వాళ్లు ఎందుకు హిందీ మాట్లాడాలి. ఏ భాష మాట్లాడాలో తేల్చుకునే హక్కు వాళ్లకు ఉంది" అని సోనూ స్పష్టం చేశాడు. ఎవరికి నచ్చిన భాష వాళ్లు మాట్లాడుకోనీ.. ఇవన్నీ వదిలేయండి అని సోనూ అన్నాడు.
టాపిక్