Sunny Leone : రూ. 1000 ఇచ్చే ప్రభుత్వ స్కీమ్‌లో సన్నీ లియోన్ పేరు- అంత అవసరం ఏముంది?
23 December 2024, 12:10 IST
- Sunny Leone latest news : ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకంలో సన్నీ లియోన్ పేరు దర్శనమిచ్చింది. ఆమె పేరుతో ఉన్న అకౌంట్లో ప్రతి నెల రూ. 1000 జమ అవుతోంది. అసలు విషయం ఏంటంటే..
ప్రభుత్వ స్కీమ్‌లో సన్నీ లియోన్ పేరు!
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాల దుర్వినియోగానికి సంబంధించిన వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా ఇలాంటి ఒక ఘటనే వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఓ స్కీమ్‌కి సంబంధించిన లబ్ధిదారుల పేరులో బాలీవుడ్ నటి, మాజీ అడల్ట్ ఫీల్మ్ స్టార్ సన్నీ లియోన్ పేరు దర్శనమిచ్చింది! ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది..
మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘మహాతరి వందన్’ పథకాన్ని బీజేపీ గతేడాది ప్రారంభించింది. అయితే ఈ పథకంలో లబ్ధిదారుగా సన్నీ లియోన్ ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది.
ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు కూడా జరిగింది. నకిలీ లబ్ధిదారు పేరిట తెరిచిన బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బును వీరేంద్ర జోషి అనే వ్యక్తి మోసపూరితంగా తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
స్థానిక అంగన్వాడీ కార్యకర్త వేదమతి జోషి ఐడీలో ఈ పథకం కింద లబ్ధిదారుగా సన్నీ లియోన్ పేరు నమోదైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
అంతేకాదు, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో రిజిస్టర్ అయిన ఓ మోసపూరిత లబ్ధిదారుకు.. 2024 మార్చి నుంచి 2024 డిసెంబర్ వరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ 'మహాతరి వందన్' పథకం నుంచి నెలకు రూ.1,000 చొప్పున అందినట్టు దర్యాప్తులో తేలింది.
మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన నిధుల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్న తరుణంలో బస్తర్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
ఈ ఘటనకు సంబంధించి స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్ వైజర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు.
బస్తర్ జిల్లా కలెక్టర్ హరీష్ ఎస్ మాట్లాడుతూ.. మహాతరి వందన్ పథకం పరిధిలోని తాలూరు గ్రామంలో సన్నీ లియోన్ పేరుతో నమోదైన నకిలీ లబ్ధిదారును గుర్తించినట్లు ప్రకటించారు.
దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించినట్లు హరీష్ ఎస్ తెలిపారు. అంతేకాకుండా ఈ మోసపూరిత లబ్ధిదారుడికి సంబంధించిన బ్యాంకు ఖాతాను సీజ్ చేయాలని, ఈ పథకం కింద పంపిణీ చేసిన నిధులను రికవరీ చేయాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు.
2023 ఛత్తీస్‌గఢ్ ఎన్నికల వేళ మహిళల ప్రోత్సాహకానికి పథకం తీసుకొస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ వాగ్దానం బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇక ఎన్నికల్లో విజయం అనంతరం ఈ మహాతరి వందన్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో సుమారు 70లక్షల మంది రిజిస్టర్డ్ లబ్ధిదారులు ఉన్నారు.