Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్; ఏడుగురు నక్సల్స్ మృతి
Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు చనిపోయారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అభూజ్ మఢ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొన్ని గంటల పాటు జరిగిన ఎదురు కాల్పుల అనంతరం ఏడు మృతదేహాలను, పెద్ద సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
భద్రతాదళాల సంయుక్త ఆపరేషన్
నారాయణపూర్, దంతెవాడకు చెందిన భద్రతా దళాల సంయుక్త బృందం ఈ ఎన్ కౌంటర్ (ENCOUNTER) లో పాల్గొందని, వారంతా సురక్షితంగా ఉన్నారని సమాచారం. కాల్పులు ఆగిపోయిన తరువాత ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇప్పటి వరకు 164 మంది నక్సల్స్ మృతి
తాజా ఎన్ కౌంటర్ తర్వాత బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎదురు కాల్పుల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 164 మంది నక్సల్స్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. గురువారం బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో నక్సలైట్ శిబిరాన్ని భద్రతా దళాలు ధ్వంసం చేసి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అక్టోబర్ 1న ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు మట్టి ట్రాక్ కింద అమర్చిన మూడు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్ (IED)లను పోలీసులు గుర్తించి, నిర్వీర్యం చేశారు.
5 కిలోల బరువున్న ఐఈడీలు
జిల్లా బలగాలు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 53వ బెటాలియన్ సంయుక్త బృందం పెట్రోలింగ్ విధుల్లో ఉండగా కస్తూర్మెటా-మొహండి గ్రామాల రహదారిలోని హోక్పాడ్ గ్రామ సమీపంలో 5 కిలోల బరువున్న ఐఈడీలను గుర్తించారు. సెప్టెంబర్ 30న సీఆర్పీఎఫ్ (CRPF) అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) అమిత్ కుమార్ మాట్లాడుతూ నక్సలిజం ఎక్కువగా ఛత్తీస్ గఢ్ లోని రెండు, మూడు జిల్లాలకే పరిమితమైందని, రాబోయే ఏడాదిన్నరలో వామపక్ష తీవ్రవాదం చరిత్రగా మారుతుందని అన్నారు. నక్సలైట్ ఉద్యమం చివరి దశకు చేరుకుందని అమిత్ కుమార్ తెలిపారు. గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్న మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడు నక్సల్స్ రహితంగా మారాయన్నారు.