ఇవేం ఆలోచనలు.. పరీక్షలు వాయిదా వేయాలని స్కూళ్లకు విద్యార్థుల బాంబు బెదిరింపులు!
22 December 2024, 17:25 IST
- Students : విద్యార్థులు చేసే కొన్ని పనులు శృతిమించుతున్నాయి. కొన్ని రోజులుగా దిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ విషయాన్ని కనిపెట్టారు పోలీసులు.
ప్రతీకాత్మక చిత్రం
కొన్ని రోజులుగా బాంబు బెదిరింపుల గురించి వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. స్కూళ్లకు కూడా ఈ బెదిరింపులు వచ్చాయి. అయితే తాజాగా పోలీసుల విచారణలో విస్తూపోయే విషయాలు తెలిశాయి. కొంతమంది విద్యార్థులు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్టుగా తేలింది.
దిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులపై జరుగుతున్న విచారణలో విచిత్రమైన విషయం తాజాగా బయటపడింది. రోహిణి జిల్లాలోని కనీసం రెండు పాఠశాలలకు విద్యార్థులే బాంబు బెదిరింపులు చేశారు. కారణం వారు పరీక్షకు సిద్ధంగా లేకపోవడం. ఆ పాఠశాలల విద్యార్థుల నుండి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కనుగొంది.
దిల్లీలోని రోహిణిలోని రెండు పాఠశాలలకు విద్యార్థులే బెదిరింపు మెయిల్స్ పంపినట్లు దిల్లీ పోలీసులు ఆదివారం గుర్తించారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా లేకపోవడంతో పరీక్షలను వాయిదా వేయాలని బెదిరింపు మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు..
ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు వేర్వేరు విద్యార్థులు ఈ మెయిల్స్‌ను రెండు పాఠశాలలకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షలకు సిద్ధంగా లేనందున పరీక్షను ఆపడానికి విద్యార్థులు ఈ మెయిల్ పంపారు అని దిల్లీ పోలీసులు తెలిపారు. వారిద్దరూ విద్యార్థులే కావడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. డిసెంబర్ 14న ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థి పశ్చిమ్ విహార్ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ పంపినట్లు దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గుర్తించింది.
విద్యార్థులు పాఠశాలకు బెదిరింపు ఇమెయిల్స్ పంపారని, ఐపీ అడ్రస్ ట్రేస్ చేసిన తరువాత తెలుసుకున్నారు. విచారణలో విద్యార్థి తప్పును అంగీకరించడంతో కౌన్సిలింగ్ ఇచ్చారు. అతని ప్రవర్తనపై నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.
డిసెంబర్ 14, 17 తేదీల్లో దిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డిసెంబర్ 13న దిల్లీలోని చాలా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశ రాజధానిలో పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని పదేపదే బాంబు బెదిరింపులు రావడంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే పిల్లల చదువులు, శ్రేయస్సు దెబ్బతింటాయని, పిల్లలపై మానసిక, అకడమిక్ ప్రభావం ఎలా ఉంటుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
బాంబు బెదిరింపులు, సంబంధిత అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి వివరణాత్మక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి)తో ప్రణాళికను రూపొందించాలని దిల్లీ హైకోర్టు నవంబర్ 19న ప్రభుత్వాన్ని ఆదేశించింది. మిగిలిన పాఠశాలలకు వచ్చిన బెదిరింపులపైనా దర్యాప్తు చేస్తున్నారు.