Rahul Gandhi On Marriage : 30 ఏళ్లుగా ఆ ఒత్తిడిని అధిగమించాను.. పెళ్లిపై రాహుల్ గాంధీ కామెంట్స్
28 August 2024, 9:05 IST
- Rahul Gandhi On Marriage : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లిపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే దీనిపై ఆయన కూడా ఫన్నీగానే స్పందిస్తారు. ఎవరైనా వివాహంపై ప్రశ్నలు వేస్తే సరదాగా సమాధానం చెబుతారు. తాజాగా మరోసారి కొందరు విద్యార్థులు ప్రతిపక్ష నేతను పెళ్లి గురించి అడిగారు.
రాహుల్ గాంధీ
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 54 ఏళ్లు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న పదే పదే ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా శ్రీనగర్‌లోని విద్యార్థినులతో సంభాషిస్తున్న సందర్భంగా మరోసారి రాహుల్ గాంధీకి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి సంబంధించిన క్లిప్‌ను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. శ్రీనగర్‌లోని కొంతమంది విద్యార్థులతో రాహుల్ గాంధీ చర్చించారు.
కశ్మీర్ విద్యార్థులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. అక్కడున్న పరిస్థితులపై మాట్లాడారు. రాజకీయాలు, విద్య, ఉద్యోగం, వివాహం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ సోదరి.. ప్రియాంక గాంధీ కూడా వీడియో కాల్ ద్వారా విద్యా్ర్థులతో మాట్లాడారు. తర్వాత రాహుల్ గాంధీ అమ్మాయిలతో మాట్లాడుతూ.. పెళ్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా అని అడిగారు. అయితే వెంటనే ఈ ప్రశ్న రాహుల్ గాంధీపైకి తిరిగి వచ్చింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.
'నేను 20-30 సంవత్సరాలుగా పెళ్లి ఒత్తిడిని అధిగమించాను. అయితే ఇది మంచి విషయం. నేను దానిని ప్లాన్ చేయను. కానీ అది జరిగితే చెప్పలేం.' అన్నట్టుగా సమాధానమిచ్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో రాయ్‌బరేలీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో రాహుల్‌కు ఈ ప్రశ్న వచ్చింది. సమావేశానికి హాజరైన ప్రియాంక.. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని అతనిని కోరారు. అప్పుడు రాహుల్ త్వరలో చేయవలసి ఉంటుంది అని చెప్పారు.
అంతకుముందు పాట్నాలో జరిగిన భారీ ప్రతిపక్ష ర్యాలీలో లాలూ యాదవ్ కూడా రాహుల్ గాంధీ వివాహంపై మాట్లాడారు. పెళ్లి చేసుకో, మేము మీ వివాహ ఊరేగింపులో భాగం కావాలనుకుంటున్నాం అని కోరారు. ఇప్పుడు మీరు చెప్పారంటే అది జరుగుతుంది.. అని కాంగ్రెస్ అగ్రనేత సరదాగా స్పందించారు.
ఇటీవలే రాహుల్ గాంధీ పెళ్లిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇందుకు కారణం బ్లిడ్జ్ పత్రికలో వచ్చిన కథనం. రాహుల్ గాంధీకి విదేశీ మహిళతో పెళ్లైనట్టుగా ప్రచురితమైంది. ఈ విషయంపై స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోనియా నివాసానికి వెళ్లారు. రాహుల్ గాంధీ మీటింగ్‌లో ఉన్నారని తెలుసుకుని వారి స్టాఫ్‌కు పత్రాలు అందజేసి వెనక్కు వచ్చారు.