Earthquake in Japan : 6.2 తీవ్రతతో జపాన్‌లో భారీ భూకంపం..
11 June 2023, 17:02 IST
Earthquake in Japan : జపాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని తెలుస్తోంది.
China Earthquake: చైనా సరిహద్దులో భూకంపం
Earthquake in Japan : ఉత్తర జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని సమాచారం.
హక్కైడోకు దక్షిణ భాగంలో, స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 6:55 గంటలకు భూమి కంపించింది. భూమికి 140కి.మీల దిగువన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జపాన్ వాతావరణశాఖ వెల్లడించింది. కాగా భూకంపం నేపథ్యంలో వాతావరణశాఖ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే.. ఈ ప్రాంతంలో ఓ అణువిద్యుత్ కేంద్రం కూడా ఉంది. కానీ దానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాతో పాటు బుల్లెట్ రైళ్ల కదలికలకు సైతం ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని స్పష్టం చేశారు.
హక్కైడోలోని ప్రధాన నగరాలు చిటోసె, అట్సుమచోలో భూ ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినట్టు తెలుస్తోంది.
Earthquake in Japan today : హక్కైడోలో సంభవించిన భూకంపం ప్రభావం.. ఉత్తర హోన్షు ప్రాంతంపైనా పడింది. ఈ ప్రాంతంలో ఉన్న జపాన్ రాజధాని టోక్యోలో మాత్రం ఎలాంటి ప్రకంపనలు వెలుగుచూడలేదు.
జపాన్‌లో భూకంపాలు తరచూ అలజడులు సృష్టిస్తుంటాయి. భూకంపం ఒక్కటే కాకుండా.. సునామీ పట్ల కూడా ప్రజలు భయాందోళన చెందుతుంటారు.
దక్షిణాఫ్రికాలో కూడా..
జపాన్‌లో భూకంపానికి ముందు.. దక్షిణాఫ్రికాలోని ప్రధాన ప్రాంతమైన జోహన్నెస్‌బర్గ్‌లో సైతం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2:38 గంటలకు 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి జోసెన్నెస్బర్గ్లోని అనేక భవనాలు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. జోహన్నెస్‌బర్గ్‌కు 20కి.మీల దూరంలో ఉన్న బోక్స్బర్గ్కు సమీపంలో ప్రకంపనలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది.
Johannesburg earthquake today : దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లో భూకంపాలు చాలా తక్కువ. 2014లో 5.3 తీవ్రతతో నగరానికి సమీపంలోని ఓ గోల్డ్ మైన్ వద్ద భూకంపం నమోదైంది. 1969లో చివరిగా వెస్టర్న్ కేప్ రాష్ట్రంలో 6.3 తీవ్రతతో భూమి కంపించింది.