తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market : ఇది తెలిస్తే చాలు.. స్టాక్​ మార్కెట్​లో 'సక్సెస్​' పక్కా!

Stock market : ఇది తెలిస్తే చాలు.. స్టాక్​ మార్కెట్​లో 'సక్సెస్​' పక్కా!

Sharath Chitturi HT Telugu

23 June 2022, 11:58 IST

google News
    • Stock market psychology : మీరు స్టాక్​ మార్కెట్లో నష్టపోతున్నారా? ఎంత ప్రయత్నించినా లాభాలు చూడటం లేదా? అయితే ఇది మీకోసమే.
ఇది తెలిస్తే చాలు.. స్టాక్​ మార్కెట్​లో 'సక్సెస్​' పక్కా!
ఇది తెలిస్తే చాలు.. స్టాక్​ మార్కెట్​లో 'సక్సెస్​' పక్కా! (AP)

ఇది తెలిస్తే చాలు.. స్టాక్​ మార్కెట్​లో 'సక్సెస్​' పక్కా!

Stock market psychology : స్టాక్​ మార్కెట్​.. ఇక్కడ అవకాశాలకు కొదవులేదు. ఇక్కడ ఎవరికి వారే బాస్​! స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అయితే.. జీవితం మారిపోతుంది. ఇది నాణానికి ఒకవైపు. స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వడం అంత ఈజీ కాదు. 'మార్కెట్​లో సక్సెస్​ అంటే.. కాస్త లక్​ కూడా ఉండాలి బాసూ..', 'మార్కెట్​ అనేది గ్యాంబ్లింగ్​'.. అని అనుకునే వారూ ఉంటారు. వాస్తవానికి స్టాక్​ మార్కెట్​లో, ముఖ్యంగా ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 2శాతం కన్నా తక్కువే! అయితే.. గెలుపొటముల మధ్య ఓ సన్నటి రేఖ ఉంది. ముందు ఆ రేఖను దాటితే.. స్టాక్​ మర్కెట్లు కూడా మనకు దాసోహం అంటాయి. ఆ 2శాతం ట్రేడర్లు చేసి చూపించారు కూడా. అదే.. 'సైకాలజీ'.

స్టాక్​ మార్కెట్​ సైకాలజీ..

స్టాక్​ మార్కెట్​లో న్యూస్​, స్ట్రాటజీలు తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. ఈ 'యూట్యూబ్'​ యుగంలో ఏదైనా అరచేతిలోనే ఉంటోంది. ఎన్నో యూట్యూబ్​ ఛానెళ్లు కూడా పుట్టుకొస్తున్నాయి. మంచి జ్ఞానాన్ని పంచుతున్నాయి.

ఈ ఛానెళ్లకు లక్షల్లో వ్యూస్​ వస్తున్నాయి. వాటిని చూసి, మార్కెట్​లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రిటైలర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరి.. అందరికి ఇంచుముంచు ఒకటే రకం పుస్తకం దొరుకుతోంది. అందరు అదే పుస్తకాన్ని చదువుతున్నారు. మరి అందరు సక్సెస్​ ఎందుకు అవ్వడం లేదు? సక్సెస్​ రేట్​ 2శాతంగానే ఎందుకు ఉంటోంది? దీనికి సమాధానమే 'సైకాలజీ'.

భయం.. దురాశ..

Stock market greed : ఈ మధ్య కాలంలో అవసరానికి మించిన న్యూస్​ కూడా లభిస్తోంది. వాటిని చూసి మదుపర్లు, ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారు మోసపోతున్నారు. స్టాక్​ పెరుగుతోందని కొనడం, పడిపోయిన తర్వాత బాధపడం సహజమైపోయింది. ఈ పద్ధతిని ముందు మార్చుకోవాలి. ఇందుకు సైకాలజీ ఉపయోగపడుతుంది.

స్టాక్​ మార్కెట్​లో సరదాకి ట్రేడింగ్​, ఇన్​వెస్ట్​మెంట్​ చేయకూడదు. మొదలుపెట్టిన తొలి రోజు నుంచే.. దీనిని ఓ వ్యాపారంగా భావించారు. వ్యాపారం క్లిక్​ అవుతుందా.. లేక పతనమవుతుందా అనేది వ్యాపారిపైనే ఆధారపడి ఉంటుంది కదా. ఇదీ అంతే! మార్కెట్​లో.. 'హమ్మయ్య అంతా నేర్చేసుకున్నాను. ఇక నేర్చుకోవాల్సింది ఏమీ లేదు,' అంటూ ఉండదు. స్టాక్​ మార్కెట్​లో కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి.

రివేంజ్​ ట్రేడింగ్​..

చాలా వరకు మార్కెట్లు నడిచేది ప్రజల భావోద్వేగాలపైనే! ఆ భావోద్వేగాలను జయించిన బడా పెట్టుబడిదారులు.. మంచిగా డబ్బులు వెనకేసుకుంటారు. ఎమోషన్స్​తో విలవిలలాడిపోయే రిటైలర్లు, అదే ఉచ్చులో పడి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్​ అందక.. చతికిలపడిపోతుంటారు. 'మార్కెట్​ వేస్ట్​ రా..' అని అనుకుంటారు.

Revenge trading : ముందుగా మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. బడా ఇన్​వెస్టర్లైనా, చిన్న చిన్న ట్రేడర్లే అయినా.. మార్కెట్​ అందరిని సమానంగానే రివార్డు చేస్తుంది. నిత్యం మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తించి, వాటిని మార్చుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఒకానొక సందర్భంలో సక్సెస్​ రుచిని చూడవచ్చు. అలా కాకుండా 'నేను చెప్పింది మార్కెట్​ వినాలి. ఎందుకు వినదో నేనూ చూస్తాను,' అని భావించి రివేంజ్​ ట్రేడింగ్​ చేస్తే.. డీమ్యాట్​ ఖాతాలోకి డబ్బులు పంపిస్తూ ఉంటే.. వెంటనే భారీ మొత్తంలో నష్టపోవడం ఖాయం.

అందుకే.. స్టాక్​ మార్కెట్​లో ‘ఫ్లెక్సిబుల్’​గా ఉండాలి. ఒక న్యూస్​ని తెలుసుకున్న తర్వాత.. అది మనకి ఎంత ఉపయోగపడుతుంది? మనం ఏం చేయాలి? అని ఆలోచించాలి. మన ఆలోచనలకు తగ్గట్టు పరిస్థితులు లేకపోతే.. మనల్ని మనం మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ట్రేడింగ్​లో.. ఒక్కోసారి నిమిషాల్లో అన్ని మారిపోతుంటాయి. అలాంటప్పుడు భయపడకుండా.. సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి వస్తుంది.

ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సచిన్​లాగా.. కోహ్లి ఆడలేడు. జహీర్​ ఖాన్​లాగా.. మలింగ బౌలింగ్​ చేయలేడు. కానీ వారందరు స్టార్లే. వారందరు సక్సెస్​ అయినవారే. ఈ విషయాన్ని కూడా అర్ధం చేసుకోవాలి. స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వాలంటే.. ముందు మన శైలిని మనం తెలుసుకోవాలి. మనకి ఏది సూట్​ అవుతుందో అర్ధం చేసుకోవాలి. కోహ్లి కూడా ఎల్లప్పుడు ఫాంలో ఉండడు కదా! మనం కూడా అంతే.. ఒక్కోసారి ఫెయిల్​ అవుతూ ఉంటాము. ఆ సందర్భాల్లో.. 'బ్యాక్​ టు బేసిక్స్​' అని అనుకుని.. మళ్లీ మొదటి నుంచి ఆరంభించే ఫ్లెక్సిబులిటీ మనకి ఉండాలి.

డబ్బులు ఊరికే రావు..

డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఉద్యోగం సంపాదించేందుకు.. నర్సరీ నుంచి డిగ్రీ వరకు చదువుతాము. ఎన్నో ఏళ్ల శ్రమ అనంతరం ఉద్యోగం వస్తుంది. కానీ స్టాక్​ మార్కెట్​లోకి వస్తూనే.. డబ్బులు సంపాదించేయాలన్న మైండ్​సెట్​ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం?

Stock market today : కోటి ఆశలతో.. కోట్లు సంపాదించాలన్న పట్టుదలతో మార్కెట్​లోకి అడుగుపెడతారు. ఏమీ తెలియకుండానే.. కొంత పెట్టుబడి పెడతారు. ముందు ఆ స్టాక్​ మంచిగానే పనిచేస్తుంది. వావ్​ అనుకుంటారు. ఇంకొంత పెడతారు. కానీ ఆ స్టాక్​ అసలు ఎందుకు పెరుగుతోంది? అన్నది ఆలోచించరు. ఎందుకంటే ప్రాఫిట్లు కనిపిస్తున్నాయి కదా! ఇది 1,2సార్లు జరుగుతుంది. కానీ అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఆ తర్వాత.. ఒక్కసారిగా ఆ స్టాక్​ ఊహించని విధంగా పడిపోతుంది. పెరిగినప్పుడు.. ఎందుకు పెరుగుతోందో తెలియదు. పడుతున్నప్పుడు కూడా మనకి ఐడియా ఉండదు. ఆనందం స్థానంలో భయం మొదలవుతుంది. మనం చూస్తుండగానే ప్రాఫిట్లు.. భారీ నష్టాలుగా మారతాయి. డబ్బులు పోతాయి. పెరిగినప్పుడు... ఇంకా పెరుగుతుందోమో అన్న ఆశతో.. పడుతున్నప్పుడు.. లాస్​లో అమ్మాలా? అన్న బాధతో ఏమీ చేయకుండా ఉండిపోతారు. ఈ పరిస్థితి ఎదురైన తర్వాత.. ఇక మార్కెట్​లో డబ్బులు పెట్టాలంటేనే వణుకు వస్తుంది.

ఇలా కాకుండా.. ముందు స్ట్రాటజీలు, సైకాలజీని పెంచుకుంటూ.. కొంతకొంత మొత్తాన్ని మార్కెట్​లోకి పంపిస్తూ ఉంటే.. ముందుగా నష్టాలు తగ్గుతాయి. ఆ తర్వాత.. స్వల్ప లాభాలను చూస్తారు. అవి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. బడా పెట్టుబడిదారులు.. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వలేదు!

జీవనశైలి..

స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వాలంటే.. జీవనశైలిని కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా ట్రేడర్లకు ఇది వర్తిస్తుంది. ఇంట్రాడే అనేది చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. అందులో 'ప్రో' అవ్వాలంటే చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. మన ఆలోచనలను ప్రభావితం చేసే విషయాలపై పట్టు ఉండాలి. సరైన నిద్ర, సరైన ఆహారం, టైమ్​ మేనేజ్​మెంట్​.. ఇలా అన్నింట్లోను సరిగ్గా ఉండాలి.

How to make money in share market : అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుని.. ఉదయాన్నే నిద్రమత్తులో ట్రేడింగ్​ చేస్తే.. అకౌంట్​లో డబ్బులు ఫ్రీగా పోగొట్టుకున్నట్టే. ఆ సమయంలో మన మైండ్​.. మార్కెట్​ మీద కన్నా ఎక్కువగా నిద్రపైనే ప్రేమ చూపిస్తుంది!

ఇంత జరిగినా, ఇంత చేసినా ఒక్కోసారి మనం అనుకున్నది జరగదు. మన అకౌంట్​ లాస్​లే చూపిస్తుంది. అలాంటప్పుడే 'సైకాలజీ' మరింత కీలకంగా వ్యవహరిస్తుంది. ఎమోషనల్​గా ఆలోచించకుండా.. లాజికల్​గా ఆలోచించే శక్తిని ఇస్తుంది.

మనకంటూ కొన్ని రూల్స్​ పెట్టుకోవాలి. వాటిని దాటి వెళ్లకూడదు. మన మైండ్​ గేమ్స్​ ఆడుతుంది. 'పర్లేదు.. రూల్స్​ బ్రేక్​ చెయ్​' అని చెబుతుంది. వాటన్నింటిని జయించి ముందుకెళ్లాలి.

బడా పెట్టుబడిదారులు ఎప్పుడూ లాస్​లు చూడలేదా? సక్సెస్​ అయిన ట్రేడర్ల పోర్ట్​ఫోలియోలు నష్టాల్లోకి జారుకోలేదా? కానీ వారందరు ఎప్పుడు 'క్విట్​' చేయలేదు. ఎంత ఎమోషనల్​గా బాధ ఉన్నా.. వారికి తెలుసు.. ఒకరోజు మళ్లీ వారికి ఛాన్స్​ వస్తుందని. వాళ్లందరు.. ఈరోజుని ఇక్కడితో వదిలేస్తారు. ఈరోజున వచ్చిన లాభాలను, నష్టాలను రేపు అనే రోజుకు తీసుకెళ్లరు. అప్పుడే ప్రశాంతత! అప్పుడే స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​!

టాపిక్

తదుపరి వ్యాసం