HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Southwest Monsoon : భారీ వర్షాల నుంచి రిలీఫ్​! నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్​..

Southwest monsoon : భారీ వర్షాల నుంచి రిలీఫ్​! నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్​..

Sharath Chitturi HT Telugu

13 September 2024, 7:20 IST

  • Southwest monsoon withdrawal 2024 : దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటు కంటే ఈ ఏడాది ఇప్పటికే 8శాతం అధిక వర్షపాతం నమోదైంది! ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై ఐఎండీ కీలక అప్డేట్​ ఇచ్చింది. ఉపసంహరణ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభయ్యే అవకాశం ఉందని వివరించింది.

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఎప్పుడు?
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఎప్పుడు?

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఎప్పుడు?

ఈ ఏడాది భారీ వర్షాలు దంచికొడుతున్నాయి! దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా చాలా అధికంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే దీర్ఘకాలిక సగటు కంటే 8శాతం అధిక వర్షపాతానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల నుంచి ప్రజలకు కాస్త రిలీఫ్​ ఇచ్చే వార్తను భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్​ ఇచ్చింది.

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ- ఎప్పటి నుంచంటే..

సెప్టెంబర్ 22 న వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ 2024 ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అదే జరిగితే గత ఎనిమిదేళ్లలో వాయువ్య భారతం నుంచి రుతుపవనాలు ఇంత త్వరగా వైదొలగడం ఇదే తొలిసారి అవుతుంది! గతేడాది సెప్టెంబర్ 25న ఈ ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2022 సెప్టెంబర్​ 30న.. పంజాబ్, ఛండీగఢ్, దిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్​ప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్​లని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు ఉపసంహరించుకున్నట్లు ఐఎండీ ప్రకటించింది. అయినప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని, ఐఎండీ ముందస్తుగా ఉపసంహరణ ప్రకటన చేసిందని నిపుణులు నాడు అభిప్రాయపడ్డారు.

“నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ రాజస్థాన్ నుంచి ప్రారంభమవుతుంది. వాయువ్య భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు ఒకేసారి ఉపసంహరించుకుంటాయని దీని అర్థం కాదు. దీనికి ముందు ఇంకా వర్షాలు పడొచ్చు. అల్పపీడన ద్రోణి వచ్చే వారం మధ్య భారతం మీదుగా గుజరాత్, రాజస్థాన్ వరకు ప్రయాణించే అవకాశం ఉండటం ఇందుకు కారణం,” అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.

"ఈ వారం దేశాన్ని ప్రభావితం చేసే విధంగా ఎలాంటి వాతావరణ సెటప్​ ఏర్పడలేదు. దక్షిణ ద్వీపకల్ప భారతంలో (ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులో) వారంలో కొన్ని రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వారంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదు. మొత్తం మీద దక్షిణ ద్వీపకల్ప భారతంలో సాధారణం కంటే ఎక్కువ, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది," అని సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు ఐఎండీ తన అంచనాలను ప్రకటించింది.

సెప్టెంబర్ మొదటి 12 రోజుల్లో 22.7% అధిక వర్షపాతం నమోదైంది. వాయువ్య భారతదేశంలో 32.3% అధిక వర్షపాతం నమోదైంది. తూర్పు- ఈశాన్య భారతదేశంలో 47.4% లోటు; మధ్య భారతదేశంలో 45.1% అధికం; ద్వీపకల్ప భారతదేశంలో 64.1% అధిక వర్షపాతం నమోదైంది.

మొత్తం మీద జూన్​ 1న నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో 19% ఎక్కువ; వాయవ్య భారతంలో 5% అధికం; తూర్పు, ఈశాన్య భారతంలో 16 శాతం, ద్వీపకల్ప భారతంలో 24 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబర్ 17న ఉపసంహరణను ప్రారంభిస్తాయి. అక్టోబర్ 15 నాటికి దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటాయి.

ఉపసంహరణ ప్రక్రియ ఆలస్యమైతే అక్టోబర్ నెలలో కోతకు వచ్చే పంటలకు ముప్పు కలిగే ప్రమాదం ఉంటుంది.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్