Bezawada Floods: బెజవాడను ముంచెత్తిన ఆకస్మిక వర్షాలు,వరదలు.. సరిగ్గా వందేళ్ల క్రితం ఏమి జరిగింది అంటే?
Bezawada Floods: తీర ప్రాంత నగరమైన విజయవాడకు వరదలు, తుఫాన్లు కొత్తేమి కాదు. సరిగ్గా వందేళ్ల క్రితం కూడా విజయవాడ నగరాన్ని ఆకస్మిక వర్షాలు చుట్టుముట్టాయి. భారీ వర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. వందేళ్ల నాటి విపత్తును స్వాతంత్య్ర సమరయోధుడు అయ్యదేవక కాళేశ్వరరావు జీవిత కథలో వివరించారు.
Bezawada Floods: ఆకస్మిక వరదలు, కుంభవృష్టిగా వర్షాలు, విపత్తులు విజయవాడ నగరానికి కొత్తేమి కాదు. బెజవాడ గత చరిత్రలో చాలా విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు దాగి ఉన్నాయి. విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి పది రోజుల పాటు అతలాకుతం చేసింది. బుడమేరు ప్రవాహంతో నగరం వరద ముంపులో చిక్కుకుపోయింది.
ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు, విజయవాడ మునిసిపల్ ఛైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా సేవలందించిన అయ్యదేవర కాళేశ్వరరావు ఆత్మకథ "నవ్యాంధ్రము - నా జీవిత కథలో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. మద్రాసు రాష్ట్రంలో భాగమైన విజయవాడను వరదలు ముంచెత్తినపుడు ఏమి జరిగిందో వివరించారు. అయ్యదేవర మునిసిపల్ ఛైర్మన్ పదవీ కాలంలో 1925లో విజయవాడను ఆకస్మిక వర్షాలు వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో విజయవాడ నగరంలో ఏమి జరిగిందో యథాతథంగా ఆయన మాటల్లోనే…
"నేను 1925 ఏప్రిలునెలలో బెజవాడ మునిసిపాలిటీకి చైర్మనుగా ఎన్నుకొనబడితినని తెలిపియుంటిని. అటుపిమ్మట ఒకనెల లోపలనే, అనగా మే 16 వ తేదీన బెజవాడలోను, బెజవాడకు తూర్పుననున్న కృష్ణా జిల్లాలోను భయంకరమైన తుపాను సంభవించెను. సుమారు 20 గంటల సేపు తుపాను గాలితో కూడా అతి జోరుగా వర్షముకురిసెను.
“పైరులకు, ఆస్తులకు లక్షల కొలది నష్టము కలిగెను, వందలాది పశువులు మరణించెను. ఇళ్ళు కూలిపోయెను. ఆ తుపానువచ్చినరోజు ఉదయము 9 గంటలకు నేను నా కారులో మాయింటినుంచి మునిసిపలు ఆఫీసుకువచ్చి నా కారుసు పంపివేసి మునిసిపలుఆఫీసు మేడమీద కూర్చొని మా మేనేజరు సుబ్బారావుగారితో సహా కాగితములను చూచుకొనుచుంటిని.”
వర్షము ప్రారంభమై క్రమక్రమ ముగ హెచ్చెను అది గొప్పదయ్యెను. మా యింటినుంచి కారు పంపుటకు వీలులేకపోయెను. త్రోవలో గొప్పవరదలుగ నీరు ప్రవహించుటయేకాక చెట్లన్నీ రోడ్డుమీద అడ్డముగ కూలెను. గుర్రపుబండ్లన్నీ ఎవరియింటిదగ్గర వారు ఆపుకున్నారు.
వణికించిన వాన..
నేను, మేనేజరు సుబ్బారావుగారు అటులనే మేడమీద _ కూర్చుంటిమి. మేడ పెంకులు లేచిపోయి మా మీద వర్షము కురియనారంభించగా క్రిందికివచ్చి రికార్డు గదిలో దాగుకొంటిమి. ఆఫీసుకు వచ్చిన గుమా స్తాలు, సిబ్బంది కూడా పక్కల నుంచి ఈదురుగాలి, పైనుంచి వర్షము కొడు తున్నందువల్ల చాల యిబ్బంది పడిరి.
నేను అదివరకే భోజనముచేసి వచ్చితిని. అప్పటినుంచి సాయంత్రము ఐదు గంటల వరకు అటులనే ఆఫీసులో దాగితిని. సాయంత్రం 5 గంటలకు కొంచెము వర్షము తగ్గినట్లు కనబడినందున నేను, మునిసిపాలిటీ మేనేజరు గొంగళ్ళను నెత్తిమీద కప్పుకొని నడుములోతు నీళ్ళలో రెండు ఫర్లాంగులు నడిచి పాతబస్తీలోని నా మిత్రులు మునిసిపలు కౌన్సిలరు అయిన కావలి శంకరరావు యింటిలో చేరితిమి.
మునిసిపలు మేనేజరు గారి యిల్లు వారి యింటి పక్కనే ఉన్నది. మాఇల్లు గవర్నరు పేటలో మునిసిపలు ఆఫీసుకు దాదాపు రెండుమైళ్ల దూరమున నున్నది. అందువల్ల మా యింటికి పోలేక, కావలి శంకరరావుగారియింటిలోనే ఆ రాత్రి యుంటిని. ఆయనభార్య ఏదో ఒకవిధముగ కొంచెము అన్నము వండి ఆవ కాయ, మజ్జిగ వేసి పెట్టినది.
లోపల తలుపువేసుకొని పడుకున్నా వర్షం తలుపులను బాదుతున్నది. ఉదయాన సుమారు ఐదుగంటలకు తెరపిచ్చినది. అపుడు నేను నెమ్మదిగా మా యింటికి వెళ్ళి బట్టలుమార్చుకొని కావలి శంకర రావు మొదలైన కొందరుకౌన్సిలర్లను వెంటతీసుకొని మునిసిపలు సిబ్బందితో సహా బస్తీ అంతా తిరిగి 12 గంటలకు ఇంటికి వచ్చినాను.
పేదలకు ఉచితంగా నేలకూలిన చెట్లు..
ఆవెంటనే 5 వేల రూపాయలను మంజూరుచేసి ఇండ్లు పోయిన వారినందరిని సత్రములలోను, స్కూళ్లలోను కొద్దిరోజులుండునట్లు ఉత్తరువుచేసి పేదవారందరికి అన్నం వండించి పెట్టి సహాయము చేయించితిమి. నేలకూలిన పెద్ద పెద్ద చెట్లన్నిటిని బెజవాడ ప్రజలలో ఎవరుపడితే వారు గొడ్డళ్లతో కొట్టుకొని ఆ కట్టెలను నెత్తిమీద పెట్టుకొని తమయిండ్లకు చేర్చుకొనవచ్చునని దండోరా వేయించితిని.
చెట్లను ఎవరు బండ్లమీద వాటిని తీసుకొనిపోకూడదు. అటుల తీసుకొనిపోయినచో దొంగ నేరముక్రింద శిక్షవేయించెదము అని తెలిపితిమి. ఈ విధముగా మూడు రోజులలో వేలకు వేలమంది పేదవారు ఆ చెట్ల కొమ్మలు కొట్టుకొని నెత్తిన మోపులు కట్టి తీసుకొని పోయిరి. వారందరికి సంవత్సరమునకు నరి పోయే వంటచెరకు, పందిళ్ళకు, బాులకు సరిపోయే కట్టెలు లభించినవి. దాదాపు చెట్లన్నీ ఖాళీ కాగా మిగిలిన పెద్ద పెద్ద మొండెములను మునిసిపలు ఆఫీసుదగ్గరకు చేర్చి వేలం వేసినాము.
కలెక్టర్ రాక…
తుపాను వచ్చిన రోజున, ఆ మరునాడు జిల్లాకలెక్టరు స్టూవర్టు బెజవాడ రహదారి బంగళాలో సున్నారు. వారిని నేనిది వరకు చూచి యుండలేదు. నేను చైర్మన్ కాగానే కలెక్టరు దర్శనము చేసే అలవాటు నాకు లేకుండెను. ఏదో పనియున్నపుడు ఉభయులము కలసేవారము. అంతే కాని, కలెక్టరుచుట్టు తిరుగకూడదని నా ఉద్దేశ్యము. కాగితములమీదనే ఉత్తరప్రత్యుత్తరములు జరుపుకొనేవారము.
స్టూవర్టు గారు తన బంగళానుంచి బయలు దేరి నన్ను కలియవలెనని మా మునిసిపలు ఆఫీసుకు, పిమ్మట మా యింటికి వచ్చి నేను లేనందున తిరిగి వెళ్ళిపోయిరి. అపుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, రాష్ట్ర ఉద్యోగస్థులు, మునిసిపాలిటీలమీద లేరు. అన్ని అధికారములు చైర్మనులకే యుండెను.
అందువల్ల చైర్మనే ప్రముఖ పాత్ర వహించెను. మా యింటికికూడ కలెక్టరుగారు వచ్చినారని తెలిసినం దున నేను వారినిచూచుటకు రహదారిబంగళాకు వెళ్ళి వారితో మాట్లాడితిని. నేను చేస్తున్న ఏర్పాట్లన్నీ వారికి తృప్తికరముగానుండెను.
చెట్లకొమ్మలన్నీ స్వయముగ కొట్టుకొని మోపులుకట్టి నెత్తిమీద పెట్టుకొనిపోవుటకు నేను ఇచ్చిన అనుజ్ఞ చాల సమంజనముగనున్నదని ఆయన సంతోషించెను. బెజవాడ బందరు హైరోడ్డు అంతయు కూలిపోయిన చెట్లమయముగ నుండెను. అటులనే ప్రజలు స్వంతముగకొట్టుకొని నెత్తిమీద తీసుకొని పోయినచో తానుకూడా అంగీకరించెదనని నాతో చెప్పెను. మేమిద్దరముకలసి ఊరంతయు చూచితిమి,.
బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం…
ప్రభుత్వమునకు వ్రాసి ప్రజల సహాయార్థము ద్రవ్యము తెప్పించెదనని కలెక్టరు నాతో చెప్పెను. పిమ్మట ఆయన బందరుకు వెళ్ళెను. బందరులో బెజవాడకంటె భీభత్సముగనుండెను. బెజవాడలో 5 లక్షల రూప్యములవరకు ఆస్తి నష్టపడినదని, వేలకు వేలగుడిశెలు కూలి పోయినవని, వందలాదిపశువులు మరణించినవని అంచనా వేయబడినది. మనుష్యులెవరును చావలేదు.
కలెక్టరుగారు బెజవాడ ప్రజలకు సహాయము చేయు నిమిత్తము ద్రవ్యము మంజూరుచేయమని మద్రాసు ప్రభుత్వమునకు వ్రాసినందున, బెజవాడలో జరిగిన నష్టమునంతను స్వయముగ చూచుటకు జస్టిసుపార్టీనాయకులును, ముఖ్యమంత్రియు, స్వపరిపాలనా మంత్రియు నగు రాజా రామారాయణంగారు బెజవాడకు విచ్చేసిరి.
నేను వారిని ఆహ్వానించుటకు బెజవాడ రైలుస్టేషనుకు పోలేదు. ఇతరపార్టీ మంత్రు లెవరైనను వచ్చినయడల వారి దర్శనమునకు పోకూడదని, వారికి సన్మానములు చేయకూడదని కాంగ్రెసు ఆదేశము. అందువల్ల నేను పోలేదు. మా మునిసిపలు వైస్ చైర్మనుగానున్న కోళందరెడ్డిగారు అపుడు స్వతంత్రుడుగానున్నం దున ఆయన వెళ్ళెను.
(అయ్యదేవర కాళేశ్వరరావు 1882 జనవరి 22న జన్మించారు. 1962 ఫిబ్రవరి23న మరణించారు. కృష్ణాజిల్లా నందిగామలో జన్మించిన ఆయన మచిలీపట్నంలో చదువుకున్నారు.1911లో ఆంధ్ర గ్రంథలయోద్యమ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1904లో బారిస్టర్ విద్యను పూర్తి చేసిన కాళేశ్వరరావు, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్, జిల్లా మున్సిఫ్ అయ్యే అవకాశాలు ఉన్నా వాటిని వదులుకున్నారు. 1906లో విజయవాడలో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. మహాత్మగాంధీ పిలుపుతో న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి స్వాంత్రోద్యమంలో పాల్గొన్నారు.)
సేకరణ అయ్యదేవర కాళేశ్వరరావు నా జీవిత కథ- నవ్యాంధ్రము నుంచి…
సంబంధిత కథనం