తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Somalia Terror Attack: హోటల్‌లోకి చొరబడి కాల్పులు… 40 మంది మృతి!

Somalia Terror Attack: హోటల్‌లోకి చొరబడి కాల్పులు… 40 మంది మృతి!

21 August 2022, 8:01 IST

google News
  • Somalia Terror Attack: సోమాలియాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. ఓ హోటల్ పై జరిపిన దాడి ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందారు. 30 గంటల తర్వాత సోమాలియా అధికారులు కీలక ప్రకటన చేశారు.

హోటల్‌లోకి చొరబడి కాల్పులు
హోటల్‌లోకి చొరబడి కాల్పులు (twitter)

హోటల్‌లోకి చొరబడి కాల్పులు

Mogadishu attack: సోమాలియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సోమాలియా రాజధాని మోగాదిషులో ఉన్న హయత్ హోటల్‌ (Hayat Hotel Attack)లోకి ఉగ్రవాదులు చొరబడి నెత్తుటేరులు పారించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మొత్తం ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా.... 70 మందికిపైగా గాయపడ్డినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.

సోమాలియాలో ఉన్న ఈ హయత్ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది. చట్టసభల సభ్యులతో పాటు ప్రభుత్వంలో భాగంగా ఉన్న వారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన అల్ షబాబ్ ఉగ్రవాదులు... శుక్రవారం రాత్రి గెస్ట్ ల రూపంలో వచ్చారు. ఇంతలోనే ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. మరికొందరు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపారు.గదుల్లో ఉన్న అతిథులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హయత్‌ హోటల్‌పై ఉగ్రదాడి జరిగిందన్న సమాచారం అందించిన వెంటనే.. సోమాలియా భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. హోటల్‌‌లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ... మొదట ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అదనపు బలగాలు కూడా రావడంతో.. సైనికులు హోటల్‌లోకి వెళ్లి.. ఉగ్రవాదులపై ఎదురు దాడి చేశారు. ఈ ఆపరేషన్ 30 గంటల పాటు సాగినట్లు అధికారులు వెల్లడించారు.

అల్ షబాబ్.... అల్-ఖైదా తీవ్రవాద గ్రూపుకు అనుబంధంగా పని చేస్తూ వస్తోంది. ఈ సంస్థ సోమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇప్పటికే దేశంలోని దక్షిణ మరియు మధ్య భాగాల్లోని పలు ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఆగస్టు 14వ తేదీన అమెరికా బలగాలు జరిపిన కాల్పుల్లో... 13 మంది అల్ షబాబ్ ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.

హోటల్ పై దాడి ఘటనను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటన విడుదల చేసింది. ఉగ్ర చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈయూ కూడా ప్రకటన చేసింది. భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ... ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ... గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది. ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాద వ్యతిరేక పోరులో సోమాలియాకు భారత్ అండగా ఉంటుందని తెలిపింది.

టాపిక్

తదుపరి వ్యాసం