అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అల్​ఖైదా కుట్ర?-isis al qaeda intend to carry out inspire large scale attacks against us fbi
Telugu News  /  National International  /  Isis, Al-qaeda Intend To Carry Out, Inspire Large-scale Attacks Against Us: Fbi
అల్​ జవహిరి
అల్​ జవహిరి (AFP)

అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అల్​ఖైదా కుట్ర?

05 August 2022, 6:37 ISTSharath Chitturi
05 August 2022, 6:37 IST

అల్​ఖైదా అధినేత అల్​ జవహిరిని అమెరికా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కాగా.. అల్​ఖైదా ఇప్పుడు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

అమెరికాపై దాడులకు పాల్పడేందుకు అల్​ఖైదా, ఐసిస్​ వంటి ఎఫ్​టీఓ(ఫారిన్​ టెర్రరిస్ట్​ ఆర్గనైజేషన్​)లు ప్రణాళికలు రచిస్తున్నాయి! ఈ విషయంపై ఎఫ్​బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు యూఎస్​ సెనెట్​కు తాజా పరిస్థితులను వివరించేందుకు ఎఫ్​బీఐ(ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​) డైరక్టర్​ క్రిస్టొఫర్ వ్రే​​ సిద్ధపడుతున్నారు.

"ఇరాక్, సిరియా​లో భౌగోళికంగా ఉనికిని కోల్పోయినప్పటికీ.. అమెరికా- మిత్రపక్షాలపై దాడులు చేసేందుకు ఐసిస్​ ప్రణాళికలు రచిస్తోంది," అని వ్రే పేర్కొన్నారు.

ఆల్​ఖైదా అధినేత అయ్​మన్​ అల్ ​జవహిరిని అమెరికా దళాలు మట్టుబెట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే క్రిస్టొఫర్​ వ్రే ఈ విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికాపై విద్వేషాలు వెళ్లగక్కే ప్రక్రియను ఆయా ఉగ్రవాద సంస్థలు నిత్యం కొనసాగిస్తున్నాయని, హింసకు పాల్పడే వేర్పాటువాద భావాలున్న వారిని ఐక్యం చేసి.. అమెరికాకు వ్యతిరేకంగా భారీ దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని వ్రే వెల్లడించారు. ముఖ్యంగా.. సోషల్​ మీడియా, మెసేజింగ్​ యాప్​లను ఉపయోగించుకుని.. ఐసిస్​ తన కార్యకలాపాలను సులుభంగా సాగించుకుంటూ ఉండటం అత్యంత ఆందోళనకర విషయమన్నారు ఎఫ్​బీఐ డైరక్టర్​.

ఇటు ఐసిస్​తో పాటు.. అటు అల్​ఖైదా సైతం అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు వ్రే పేర్కొన్నారు.

అల్​ జవహరి హత్య..

అఫ్గానిస్థాన్​లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో అల్​ఖైదా అధినేత అయ్​మన్​ అల్​ జవహిరి హతమయ్యాడు. ఈ విషయాన్ని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్​ ఈనెల 2న వెల్లడించారు.

"నా ఆదేశాలతో.. అమెరికా సైన్యం.. శనివారం కాబుల్​లో వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో అల్​ జవహిరి హతమయ్యాడు. ఎంత కాలం గడిచిపోయినా, ఎవరు ఎక్కడ దాగి ఉన్నా.. ప్రజలకు మీరు ముప్పు అని తెలిస్తే.. మిమ్మల్ని అమెరికా వేటాడి చంపేస్తుంది. న్యాయం జరిగింది," అని మీడియాకు జో బైడెన్​ వెల్లడించారు.

అమెరికా పౌరులు, దౌత్యవేత్తలు, సైన్యాధికారులను హత్య చేసే విధంగా అయ్​మన్​ అల్​ జవహిరి కుట్ర పన్నినట్టు బైడెన్​ ఆరోపించారు.

"బిన్​ లాడెన్​కు జవహిరి అత్యంత సన్నిహుతుడు. 9/11 దాడుల్లో బిన్​ లాడెన్​కు జవహిరి డిప్యూటీగా పనిచేశాడు. 9/11 దాడులకు ప్రణాళికలు రచించడంలో అతనిది కీలక పాత్ర," అని జో బైడెన్​ వివరించారు.

"ఏడాది క్రితం.. అఫ్గానిస్థాన్​లో అమెరికా సైన్యం కార్యకలాపాలను ముగించాలని నేను నిర్ణయించాను. 20ఏళ్ల తర్వాత అక్కడ మన సైన్యం అవసరం లేదనిపించింది. కానీ అమెరికా ప్రయోజనాల కోసం.. అఫ్గాన్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రజలకు మాట ఇచ్చాను. అల్​ఖైదా అధినేత విషయంలో ఇప్పుడదే చేశాను," అని జో బైడెన్​ పేర్కొన్నారు.

సంబంధిత కథనం