Ayman al-Zawahiri : అల్​ఖైదా అధినేతను అమెరికా ఎలా గుర్తించింది? ఎలా చంపింది?-how the cia identified and killed al qaeda leader ayman alzawahiri ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How The Cia Identified And Killed Al-qaeda Leader Ayman Al-zawahiri

Ayman al-Zawahiri : అల్​ఖైదా అధినేతను అమెరికా ఎలా గుర్తించింది? ఎలా చంపింది?

Sharath Chitturi HT Telugu
Aug 02, 2022 11:38 AM IST

Ayman al-Zawahiri : అల్​ఖైదా అధినేత అల్​ జవహరిని అమెరికా సైన్యం మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్​ ఓ సినిమా కథ స్థాయిలో జరిగింది.

అయ్​మన్​ అల్​ జవహరి
అయ్​మన్​ అల్​ జవహరి (AFP)

Ayman al-Zawahiri : 9/11 ఉగ్రదాడి నుంచే.. ప్రస్తుత అల్​ఖైదా అధినేత ఆయ్​మన్​ అల్​ జవహరిపై అమెరికా కన్ను ఉంది. అతడిని పట్టించినా, ఎక్కడున్నాడు అన్న సమాచారం ఇచ్చినా.. 25మిలియన్​ డాలర్లు ఇస్తామని గతంలోనే ప్రకటించింది. కాగా.. కొన్నేళ్లుగా అల్​ జవహరి కార్యకలాపాలపై అమెరికా మరింత దృష్టిసారించింది. అతడిని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకుంది.

ట్రెండింగ్ వార్తలు

కాబుల్​ సేఫ్​ హౌజ్​..

అల్​ఖైదా అధినేత అల్​ జవహరి మాత్రం.. ఎన్నో ఏళ్లు రహస్యంగా దాక్కునే ఉన్నాడు. చీకట్లోనే తన కార్యకలాపాలను సాగించాడు. అతను పాకిస్థాన్​లోని అదివాసీ ప్రాంతాల్లో ఉన్నట్టు ఒకసారి, అఫ్గానిస్థాన్​లో ఉన్నట్టు ఇంకోసారి వార్తలు వచ్చాయి. ఎన్నో ఏళ్ల పాటు నిరీక్షించిన అమెరికా.. పక్క ప్రణాళికతో ముందడుగు వేసింది.

అల్​ జవహరికి మద్దతుగా నిలిచిన నెట్​వర్క్​ను కొన్నేళ్లుగా ట్రాక్​ చేస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇక అఫ్గానిస్థాన్​ నుంచి తమ సైన్యం బయటకు వెళ్లిపోయాక.. దేశంలో అల్​ఖైదా ప్రభావం పెరుగుతుందని అమెరికా భావించింది.

ఈ ఏడాది.. అల్​ జవహరి కుటుంబాన్ని అధికారులు గుర్తించారు. కాబుల్​లోని ఓ సేఫ్​ హౌజ్​కు జవహరి భార్య, కుమార్తె- ఆమె పిల్లలు వెళ్లడాన్ని గమనించారు. కొన్ని రోజుల తర్వాత అక్కడికి అల్​ జవహరి కూడా వచ్చాడు!

Ayman Al-Zawahiri 9/11 : సేఫ్​ హౌజ్​లో ఉన్న వ్యక్తి.. ఆ తర్వాత బయటకి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో అందులో ఉన్నది అల్​ఖైదా అధినేతేనా? అని ధ్రువీకరించుకునేందుకు అమెరికాకు కొన్ని నెలలు పట్టింది. ఆ సేఫ్​ హౌజ్​ బాల్కెనీలో జవహరి పలుమార్లు కనిపించాడు. ఆ విధంగా.. అక్కడ ఉన్నది జవహరినే అని ఏప్రిల్​ తొలినాళ్లల్లో.. అధికారులు ఫిక్స్​ చేశారు.

ఆ వెంటనే అమెరికాలో ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. అధ్యక్షుడు జో బైడెన్​కు అప్పటి పరిస్థితులను అధికారులు వివరించారు. జవహరి హత్యకు బైడెన్​ అంగీకరించారు. ఇక పనులు వేగంగా ముందుకు కదిలాయి.

ముందు కాబుల్​లోని ఆ సేఫ్​ హౌజ్​ను అధికారులు బయట నుంచి దర్యాప్తు చేశారు. నిర్మాణం ఎలా జరిగింది? అసలు ఆ సేఫ్​ హౌజ్​ను ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఎలాంటి నష్టం జరగకుండా.. అక్కడ అమెరికా ఆపరేషన్​ నిర్వహించవచ్చా? అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో పడ్డారు.

Al Zawahiri : ఈ క్రమంలోనే జులై తొలినాళ్ల నుంచి.. అల్​ జవహరి హత్యకు ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఆ వివరాలన్నీ.. బైడెన్​కు అధికారులు ఎప్పటికప్పుడు అందించారు. బైడెన్​ కూడా.. ప్రణాళికలను కుణ్నంగా పరిశీలించేవారు. జులై 25న ఈ విషయంపై చివరిసారిగా.. బైడెన్​తో ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.

"అన్ని విషయాలను బైడెన్​ అడిగి తెలుసుకున్నారు. వాతావరణం ఎలా ఉంటుంది? వెలుతురు ఉంటుందా? ఆపరేషన్​ను అడ్డుకునే విధంగా ఏదైనా జరిగే అవకాశం ఉందా?" అన్న ప్రశ్నలు బైడెన్​ వేశారని ఓ అధికారి వెల్లడించారు.

వైమానిక దాడి జరిగితే.. కాబుల్​లో జరిగే నష్టంపైనా వివరణ ఇవ్వాలని బైడెన్​ అడిగినట్టు తెలుస్తోంది.

అదే సమయంలో.. ఉన్నతస్థాయి న్యాయ నిపుణుల బృందం సమావేశమైంది. అల్​ జవహరిని మట్టుబెడితే వచ్చే న్యాయపరమైన సవాళ్లను పరిశీలించింది. అమెరికా పౌరుల హత్యకు పాల్పడిన జవహరిని చంపవచ్చని, ఎలాంటి న్యాయపరమైన సవాళ్లు వచ్చినా ఎదుర్కోవచ్చని తేల్చింది.

ఆ విధంగా.. అఫ్గానిస్థాన్​ కాలమానం ప్రకారం.. జులై 30 రాత్రి 9:48గంటలకు.. అల్​ జవహరి ఉన్న సేఫ్​ హౌజ్​పై అమెరికా సైన్యం వైమానికి దాడి చేసింది.

ఇక్కడ.. వైమానిక దాడి జరిగిన విధానాన్ని ప్రస్తావించారు. అల్​ జవహరి తన సేఫ్​ హౌజ్​ బాల్కెనీలో కనిపించాడు. 'హెల్​ఫైర్​'గా పిలిచే రెండు మిసైళ్లను డ్రోన్ల ద్వారా అమెరికా సైన్యం అతడిపై ప్రయోగించింది. అంతే.. పెద్దగా శబ్దాలేవీ రాలేదు. బాల్కెనీలోని కిటికీలు పగిలిపోయాయి. మిగిలిన సేఫ్​ హోజ్​ మొత్తం.. చెక్కుచెదరకుండా అలాగే ఉంది.

పని జరిగిపోయింది. అల్​ జవహరి మరణించాడు. అతడి కుటుంబసభ్యులకు ఎలాంటి హానీ జరగలేదు. ఆపరేషన్​ ముగిసింది.

అల్​ ఖైదా అధినేత అల్​ జవహరిని మట్టుబెట్టినట్టు తాజాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రపంచానికి ప్రకటించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్