School bus Accident: స్కూల్ బస్సు బోల్తా: ఆరుగురు చిన్నారులు మృతి
11 April 2024, 12:07 IST
School bus Accident: హరియాణా లోని మహేంద్రగఢ్ జిల్లాలో ఉన్న ఉనాని గ్రామ సమీపంలో గురువారం ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
బస్సు బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థుల మృతి
హరియాణాలో 30 మంది చిన్నారులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా (School bus Accident) పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. మహేంద్రగఢ్ జిల్లాలో ఉన్న కనినాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్ కు చెందిన స్కూల్ బస్సు స్కూల్ సమీపంలో ఉన్న ఉనాని గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ ఆ పాఠశాలను నిర్వాహకులు నడిపిస్తున్నారు.
క్షతగాత్రులు ఆసుపత్రులకు..
‘‘గాయపడిన విద్యార్థులను మహేందర్ గఢ్, నార్నౌల్ లోని వివిధ ఆసుపత్రులకు తరలించాము. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో, వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు చిన్నారులు మృతి చెందారు’’ అని ఒక సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సీమా త్రిఖా స్పందించారు. వెంటనే విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
మద్యం మత్తులో డ్రైవర్
బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. బస్సు డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని మహేందర్ గఢ్ ఎస్పీ అర్ష్ వర్మ తెలిపారు. బస్సు ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఆరేళ్ల క్రితం 2018లో ముగిసిందని వెల్లడించారు. ‘‘బస్సుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నాం. పాఠశాల యాజమాన్యాన్ని ఇంకా సంప్రదించలేదు. ’’ అని ఎస్పీ తెలిపారు.