Simi Garewal: మాజీ ప్రియుడు రతన్ టాటా మరణంపై సిమి గరేవాల్ భావోద్వేగ స్పందన
10 October 2024, 16:46 IST
రతన్ టాటా మృతిపై దేశవిదేశాల్లోని రాజకీయ, వ్యాపార దిగ్గజాలు తమ సంతాపాన్ని, దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటి, టీవీ హోస్ట్ సిమి గరేవాల్ కూడా రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు తామిద్దరి మధ్య అనుబంధం కొనసాగిన విషయాన్ని ఆమె కొన్నాళ్ల క్రితం వెల్లడించారు.
సిమి గరేవాల్, రతన్ టాటా
నటి సిమి గరేవాల్ చాలా అరుదుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే గురువారం ఉదయం ఆమె దానికి మినహాయింపు ఇచ్చారు. అయితే, ఆ సందర్భం చాలా బాధాకరమైనది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలో కన్నుమూయడం పట్ల సిమి సంతాపం వ్యక్తం చేశారు. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన మిగతా వారిలా కాకుండా, రతన్ టాటాతో ఆమెది అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత అనుబంధం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. రతన్ టాటా, సిమి గరేవాల్ దశాబ్దాల క్రితం ప్రేమలో పడ్డారు. ఆ తరువాత విడిపోయినా, మంచి స్నేహితులుగా కొనసాగారు.
రతన్ టాటాకు సిమి గరేవాల్ నివాళి
గురువారం ఉదయం దివంగత రతన్ టాటాతో తాను రెండెజ్యూస్ విత్ సిమి గరేవాల్ షో చేసినప్పటి ఫొటోలను సిమి గరేవాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు, రతన్ టాటాను కోల్పోయిన బాధను వ్యక్తపరుస్తూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. ‘‘మీరు వెళ్లిపోయారని అందరూ అంటున్నారు. మీరు లేని లోటును భరించడం చాలా కష్టం.. మరీ కష్టం.. వీడ్కోలు మిత్రమా.. #RatanTata.’’ అని సిమి గరేవాల్ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు.
రతన్ టాటాతో అనుబంధం
బాలీవుడ్ (bollywood) లో యాక్టివ్ గా ఉన్న సమయంలో రతన్ టాటాతో కొన్నాళ్లు డేటింగ్ చేశానని సిమి 2011 లో వెల్లడించారు. తామిద్దరం విడిపోయినా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గానే కొనసాగామని తెలిపారు. 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమి మాట్లాడుతూ.. 'రతన్, నేను జీవితంలో చాలా దూరం ప్రయాణించాము. అతను పరిపూర్ణుడు, అతను హాస్య చతురత కలిగి ఉన్నాడు, నిరాడంబరంగా ఉంటాడు. పరిపూర్ణమైన వ్యక్తి. డబ్బు ఎప్పుడూ అతనికి చోదక శక్తి కాదు. అయితే, అతను విదేశాల్లో ఉన్నంత రిలాక్స్డ్ గా ఇండియాలో లేడు.
ఆర్మీ అధికారి కూతురు..
లూధియానాలో ఆర్మీ అధికారికి జన్మించిన సిమి గరేవాల్ 1962లో ఓ ఆంగ్ల చిత్రం ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు. ఆమె తరువాత బాలీవుడ్. బెంగాలీ సినిమాల్లోకి ప్రవేశించారు. దో బదన్, మేరా నామ్ జోకర్, అరన్యేర్ దిన్ రాత్రి, సిద్ధార్థ. కర్జ్ వంటి హిట్ చిత్రాలలో నటించారు. 90వ దశకం, 2000 ల ప్రారంభంలో సిమి గరేవాల్ వినూత్న టాక్ షో హోస్ట్ గా కొత్త తరం ప్రేక్షకుల అభిమానం పొందారు.
రతన్ టాటా కన్నుమూత
రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్న రతన్ టాటా (Ratan Tata) బుధవారం రాత్రి 11.30 గంటలకు దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.