Pakistan PM : పాకిస్థాన్ ప్రధానిగా షెహ్బాజ్ షరీఫ్ ప్రమాణం..
03 March 2024, 15:55 IST
Pakistan new prime minister : పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ దేశ స్పీకర్ ప్రకటన చేశారు.
పాకిస్థాన్ ప్రధానిగా షెహ్బాజ్ షరీఫ్ ప్రమాణం..
Pakistan PM Shehbaz Sharif : పాకిస్థాన్‌లో రాజకీయ ప్రతిష్ఠంభణకు తెరపడింది! ఆ దేశ ప్రధానిగా షెహ్బాజ్ షరీఫ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో.. అరుపులు, గందరగోళం, నిరసనల మధ్య జరిగిన ఓటింగ్ ప్రక్రియలో 201 ఓట్లతో షెహ్బాజ్ ఎన్నికయ్యారని స్పీకర్ ఆదివారం ప్రకటించారు.
బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)తో కలిసి పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కు చెందిన షెహ్బాజ్ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు గల ఇండిపెండెంట్లు అత్యధిక సంఖ్యలో విజేతలుగా నిలవగా, పీఎంఎల్-ఎన్, పీపీపీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ తన తమ్ముడు షెహ్బాజ్ షరీఫ్, పార్టీ విధేయుడు సర్దార్ అయాజ్ సాదిక్‌లను ప్రధాని, జాతీయ అసెంబ్లీ స్పీకర్ పదవులకు ఆమోదించారు.
షెహ్బాజ్.. 2023 ఆగస్టు వరకు 16 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
సంకీర్ణ అధికారం కొనసాగేనా?
పీఎంఎల్-ఎన్-పీపీపీ పొత్తు ఒప్పందంలో భాగంగా నవాజ్ షరీఫ్ (nawaz Sharif) కుమార్తె మరియం నవాజ్‌ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. నవాజ్ రాజకీయ వారసురాలు మరియం సోమవారం ప్రమాణ స్వీకారం చేసి దేశంలోని ఓ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
పీపీపీ సీనియర్ నేత, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి అధ్యక్ష పదవి దక్కాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలిచారు?
* ఇమ్రాన్ ఖాన్‌కు (Imran Khan Pakistan) చెందిన పీటీఐతో జతకట్టిన స్వతంత్ర అభ్యర్థులు 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు గాను 93 స్థానాలను కైవసం చేసుకున్నారు.
* నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ జాతీయ అసెంబ్లీలో 75 స్థానాల్లో విజయం సాధించింది.
* పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) జాతీయ అసెంబ్లీలో 54 స్థానాలు గెలుచుకుంది.
* దేశ విభజన సమయంలో భారత్ నుంచి వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కరాచీకి చెందిన ముత్తహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ)కు 17 సీట్లు వచ్చాయి.
• అభ్యర్థి మృతి చెందడంతో ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది.
పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం అక్కడ 266 సీట్లు ఉన్నాయి. ఒక సీటులో ఎన్నిక జరగలేదు. ఫలితంగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 265 సీట్లల్లో కనీసం 133 చోట్ల గెలవాలి.