Pakistan election: పాకిస్తాన్ లో నవాజ్ - భుట్టోల సంకీర్ణ ప్రభుత్వం; ఇమ్రాన్ ఖాన్ పరిస్థితేంటి..?
10 February 2024, 15:53 IST
Pakistan election results: పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో, ఆ దేశ ఆర్థిక పరిస్థితి తరహాలోనే గందరగోళ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అత్యధిక స్థానాలు సాధించిన నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’.. విజయం తమదేనని ప్రకటించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మద్ధతివ్వాలని పీపీపీని కోరింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పక్కన ఆయన కూతురు మరియం షరీఫ్
Pakistan new government: పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 71 సీట్లను ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’ గెల్చుకుంది. 53 స్థానాలను మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో సారధ్యం వహిస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. నవాజ్ షరీఫ్ కు దేశంలో శక్తిమంతమైన సైన్యం మద్ధతు ఉంది.
100 కు పైగా ఇండిపెండెంట్లు
పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో (Pakistan election) 100 మందికి పైగా స్వతంత్రులు విజయం సాధించడం విశేషం. అంటే, పాక్ జాతీయ అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ గ్రూప్ ఇండిపెండెంట్లదే అవుతుంది. కాగా, ఈ 100 మందిలో దాదాపు అందరూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్ధతుదారులే కావడం గమనార్హం. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం జైళ్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ కూడా గెలుపొందారు.
సంకీర్ణ సర్కారు
ఫలితాలు వెలువడుతుండగానే, నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) సోదరుడు షెహబాజ్ షరీఫ్ పీపీపీ నేత బిలావల్ భుట్టో (Bilawal Bhutto), మాజీ అధ్యక్షుడు, బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీలను కలిసి పాకిస్తాన్ కోసం కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు పీపీపీ నేతలు అంగీకరించినట్లు సమాచారం. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కేంద్రంలో, అలాగే, కీలకమైన పంజాబ్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని జియో న్యూస్ నివేదించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారంతో ముగియనుండటంతో.. ఆ తరువాత ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధించిందనే విషయంలో స్పష్టత వస్తుంది.
ప్రధాని ఎవరు?
పీఎంఎల్-ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ సోదరుడు, మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆపద్ధర్మ పంజాబ్ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ నివాసంలో పీపీపీఅగ్రనేతలతో సమావేశమయ్యారని జియో న్యూస్ తెలిపింది. భవిష్యత్ ప్రభుత్వ ఏర్పాటుపై షెహబాజ్ షరీఫ్ జర్దారీతో చర్చించారని, నవాజ్ షరీఫ్ సందేశాన్ని కూడా తెలియజేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో షెహబాజ్ షరీఫ్ బిలావల్ భుట్టో, ఆయన తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీలను పాకిస్థాన్లో రాజకీయ, ఆర్థిక సుస్థిరత కోసం పీఎంఎల్-ఎన్ నాయకత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. కాగా, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని బాధ్యతలు ఎవరు చేపడ్తారన్న అంశం ప్రస్తుతం పాకిస్తాన్ లో కీలకంగా మారింది. పీపీపీ నేత బిలావల్ భుట్టో కూడా ప్రధాని పదవిని ఆశిస్తున్నారు.
కేంద్రంలో, పంజాబ్ లో..
పంజాబ్, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇద్దరు పీపీపీ నేతలు అంగీకరించారని, తదుపరి సమావేశంలో ఇరు పార్టీలు తమ సొంత అభిప్రాయాలను వెల్లడిస్తాయని, ఎవరు ఏ పదవిని చేపట్టాలనే దానిపై అధికార భాగస్వామ్య ఫార్ములాకు సంబంధించిన అన్ని విషయాలను పరస్పర సంప్రదింపులతో ఖరారు చేస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, తన మాజీ మిత్రపక్షాలైన పీపీపీ, జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్), ముత్తహిదా క్వామీ మూవ్మెంట్ (పాకిస్థాన్)ల సాయంతో ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు. రాజకీయ సంక్షోభం, అనిశ్చిత ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో పీఎంఎల్ -ఎన్ విజయం సాధించిందని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ స్పందన
ఇదిలావుండగా, ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్లు జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆయన పార్టీ పీటీఐ శనివారం విడుదల చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోలో ఆయన సందేశాన్ని వినిపించారు. కోర్టు,ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అభ్యర్థులు గురువారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. శనివారం ఉదయం నాటికి ఇమ్రాన్ ఖాన్ కు విధేయులుగా ఉన్న ఇండిపెండెంట్లు 99 స్థానాల్లో విజయం సాధించారు.