Safety apps for Women | సేఫ్టీ యాప్స్ ఆపద సమయాల్లో మహిళలకు అండ
09 February 2022, 18:17 IST
- మహిళా భద్రత పేరుతో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా వారిపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. 2020తో పోల్చితే 2021లో 31 శాతం ఈ తరహా నేరాలు, ఫిర్యాదులు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మహిళలు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ పొందేందుకు స్మార్ట్ ఫోన్లలో పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఒంటరి ప్రయాణాల్లో ఎమర్జెన్సీ యాప్స్ తప్పనిసరి
మహిళలకు ఆపద సమయాల్లో భద్రతనిచ్చే యాప్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన మొబైల్స్‌లో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవీ..
112 APP MHA
కేంద్ర హోం శాఖ రూపొందించిన 112 మొబైల్ యాప్‌ను మీరు డౌన్ లోడ్ చేసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో మీకు తక్షణ రక్షణ లభిస్తుంది. మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా యాప్ గుర్తించి వారి నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు.. ఈ యాప్‌లో మీరు వలంటీర్‌గా నమోదు చేసుకుంటే, ఎవరైనా ఆపద సందర్భాల్లో ఈ యాప్ వినియోగించినప్పుడు, మీరు సమీపంలో ఉంటే వలంటీర్‌గా కూడా మీరు వారిని ఆదుకోవచ్చు.
AP POLICE SEVA
ఏపీ పోలీస్ సేవా యాప్ కూడా మీకు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను కాంటాక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. మీరు ఏ లొకేషన్‌లో ఉన్నప్పటికీ పోలీస్ నెట్‌వర్క్ ద్వారా మీకు రక్షణ లభిస్తుంది.
HAWK EYE- TELANGANA POLICE
తెలంగాణ పోలీసు విభాగం రూపొందించిన హాక్ ఐ యాప్ కూడా అత్యవసర సమయాల్లో మహిళలకు రక్షణగా నిలుస్తోంది. ఎస్ఓఎస్ బటన్ నొక్కినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో సంబంధిత వివరాలు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు, ఏసీపీకి, డీసీపీకి, పెట్రోలింగ్ వ్యాన్‌కు చేరిపోతాయి. లొకేషన్ వివరాలు, ఆపదలో ఉన్న వారి ఫోన్ నెంబర్, ఇతర వివరాలన్నీ వారికి చేరుతాయి. తక్షణం రక్షణ కల్పించేందుకు వారు చర్యలు చేపడతారు.
బీ సేప్ (BSAFE)
Sos అలారమ్ సహా అనేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. ఇది మీరు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వివరాలను, ఆడియో-వీడియో వివరాలను తెలియపరుస్తుంది. ఒకవేళ మీ ఫోన్ పాకెట్లో లేదా పర్స్‌లో ఉన్నప్పుడు వాయిస్ కమాండ్ ద్వారా కూడా పనిచేస్తుంది. మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టు నటించేందుకు దీనిలో ఫేక్ కాల్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో టైమర్ అలారమ్ ఆప్షన్ కూడా ఉంది. మీ గార్డియన్‌కు మీ వివరాలు ఎప్పటికప్పుడు ఇది తెలియపరుస్తుంది.
మై సేఫ్టి పిన్ (MY SAFETIPIN)
మీరు రిస్కీ ఏరియాలో ఉన్నప్పుడు ఈ యాప్ నోటిఫికేషన్ పంపిస్తుంది. మీరు మీ స్నేహితులు, బంధువులను మిమ్మల్ని ట్రాక్ చేయమని కోరవచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లభ్యత, సెక్యూరిటీ, లైటింగ్, బహిరంగ ప్రదేశాలు, జనసాంధ్రత తదితర వివరాల ఆధారంగా రిస్కీ ఏరియాను గుర్తిస్తుంది. ఆయా పారమీటర్ల ఆధారంగా రిస్కీ ఏరియాకు మీరే రేటింగ్ ఇవ్వొచ్చు.
చిల్లా (CHILLA)
అకస్మాత్తుగా జరిగే దాడి సమయంలో మనం వెంటనే మొబైల్‌లో ఎమర్జెన్సీ బటన్ నొక్కే అవకాశం ఉండకపోవచ్చు. మొబైల్ బ్యాగులో ఉండొచ్చు. పాకెట్లో ఉండొచ్చు. చిల్లా యాప్ ప్రత్యేకత ఏంటంటే మీరు అరిచినప్పుడు మీ గొంతును గుర్తించి యాప్ స్పందిస్తుంది. మీ సంరక్షకులకు అలెర్ట్ మెసేజ్ అందిస్తుంది. అలాగే పవర్ బటన్‌ను ఐదుసార్లు నొక్కితే కూడా మీరు ఎక్కడున్నారన్న సమాచారం మీ గార్డియన్స్‌కు తెలిసిపోతుంది.
సేకురా (SEKURA)
ఈ యాప్‌లో నాలుగు ఫీచర్ బటన్స్ ఉన్నాయి. వీధుల్లో వేధింపులు, ఇతర రక్షణ లేని సందర్భాలు వంటి వేర్వేరు అంశాలను డీల్ చేసేలా ఫీచర్లు ఉన్నాయి. ఫేక్ ఇన్ కమింగ్ కాల్ సృష్టించవచ్చు. ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయొచ్చు. ప్రి సెలెక్టెడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు మీ లొకేషన్ వివరాలు పంపొచ్చు.
స్మార్ట్ 247 (SMART 24*7)
పానిక్ బటన్‌ను ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ కాల్ సర్వీస్ చేసుకోవచ్చు. ఇదివరకే మీరు ఎంచుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు కాల్ చేయొచ్చు. జీపీఎస్ వర్క్ చేయకపోయినా యాప్ ఆటోమేటిగ్గా మీ లొకేషన్‌ను ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తుంది. ఇది అత్యవసర సందర్భాల్లో ఆడియో, వీడియో రికార్డ్ చేసి పంపుతుంది. ఇమేజెస్ కూడా పంపుతుంది.