Scanning Apps | స్కానింగ్ యాప్స్.. క్యామ్ స్కానర్ కంటే మెరుగైనవి
28 February 2022, 15:46 IST
- ఫైల్స్ స్కాన్ చేసి అప్ లోడ్ చేయడానికి మీరు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లోనే అత్యుత్తమ స్కానింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు మనదేశంలో ఎంతో పాపులరైన క్యామ్ స్కానర్(Camscanner) యాప్ నిషేధం తర్వాత కొన్ని అనువర్తనాలను వినియోగదారులు విరివిగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
స్కానింగ్ యాప్స్
డిజిటల్ వినియోగం పెరిగిన తర్వాత ప్రతి విషయానికి ఆన్‌లైన్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగం, పరీక్షలు, బ్యాంక్ సేవలు ఒక్కటేమిటి చాలా వరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పీడీఎఫ్, జేపీజీ ఫైల్స్ అప్‌లోడ్ చేయాలంటే తప్పకుండా డాక్యూమెంట్లను స్కాన్ చేయాలి. ఇందుకోసం మీరు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్‌లోనే అత్యుత్తమ స్కానింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు మనదేశంలో ఎంతో పాపులరైన క్యామ్ స్కానర్(Camscanner) యాప్ నిషేధం తర్వాత కొన్ని అనువర్తనాలను వినియోగదారులు విరివిగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లకు పనికొచ్చే అత్యుత్తమ స్కానింగ్ యాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అడోబ్ స్కాన్..
ఈ యాప్ టెక్స్ట్ ను ఆటోమేటిక్‌గా గుర్తించి మల్టిపుల్ ఫార్మాట్లలో(పీడీఎఫ్, జేపీజీ) వినియోగదారులు వాటిని సేవ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. అంతేకాకుండా స్పేస్‌ను కూడా సర్దుబాటు చేసుకునే ఫీచర్ ఇందులో ఉంది. గూగుల్ స్టోర్‌లో ఉచితంగానే ఈ అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్‌కు అనుగుణంగా ఈ యాప్ సైజ్ మారుతుంది.
మైక్రోసాఫ్ట్ లెన్స్..
మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు చెందిన ఈ స్కానింగ్ యాప్‌లో బహుళ ఫీచర్లు ఉన్నాయి. వైట్ బోర్డ్స్ పిక్చర్స్, డాక్యూమెంట్లను వినియోగదారు తాను సౌకర్యవంతంగా చూసుకునే విధంగా కత్తిరించుకోవచ్చు(Trim). ఈ యాప్ కూడా ఉచితంగానే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్యాలరీలో సేవ్ చేసిన ఇమేజెస్‌ను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
గూగుల్ డ్రైవ్(Google drive)..
ఇటీవల కాలంలో వస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా వరకు గూగుల్ డ్రైవ్ యాప్ ప్రీ-లోడెడ్‌గానే ఉంటుంది. ఈ అనువర్తనం ద్వారా పీడీఎఫ్ ఫైల్స్‌ను స్కాన్ చేయవచ్చు. 'న్యూ అండ్ స్కాన్' ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. స్కానింగ్ పూర్తయిన తర్వాత ఓకే బటన్‌ను క్లిక్ చేయండి. మల్టిపుల్ ఇమేజెస్‌ను క్లిక్ చేయడానికి 'బల్క్ యాడ్' ఆప్షన్‌పై నొక్కండి.
కాగజ్ స్కానర్(Kaagaz scanner)..
క్యామ్ స్కానర్‌లో ఉండే ప్రతి ఫీచర్ ఈ యాప్‌లోనూ ఉన్నాయి. గతేడాది నిషేధించిన చైనా యాప్స్‌లో క్యామ్ స్కానర్ కూడా ఉండటంతో కాగజ్ స్కానర్ వెలుగులోకి వచ్చింది. సేమ్ ఆప్షన్లు ఉండటంతో అత్యధిక డౌన్‌లోడ్లను అందుకుంది.
టర్బో స్కాన్(TurboScan)..
స్కానింగ్ మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లకు నోట్‌ప్యాడ్ లాగా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా మల్టీ పేజ్ డాక్యూమెంట్స్, ఇంపోర్టింగ్ ఇమేజెస్, ఆటోమేటిక్ డాక్యూమెంట్ ఎడ్జ్ డిటెక్షన్, కరెక్షన్ లాంటి తదితర కీలక ఫీచర్లను టర్బో స్కాన్ కలిగి ఉంది.
పైన పేర్కొన్నవి కాకుండా ఫైన్ రీడర్ పీఢీఎఫ్, స్మార్ట్ డాక్ స్కానర్ లాంటి ఇతర స్కానింగ్ యాప్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రీమియం చెల్లింపుతో అదనపు ఫీచర్లను కలిగి ఉన్నమరికొన్ని స్కానింగ్ యాప్స్ కూడా విపణిలో దొరుకుతున్నాయి.
టాపిక్