సరిహద్దుల్లో బలగాలపై రష్యా అనూహ్య నిర్ణయం!
15 February 2022, 15:27 IST
- Russia-Ukraine crisis | ఉక్రెయిన్‌తో సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో రష్యా అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సరిహద్దు వెంబడి కొన్ని ప్రాంతాల్లోని బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సమాచారం.
సరిహద్దులో రష్యా బలగాలు
Russia Ukraine news | ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తుందన్న వార్తల మధ్య అక్కడి సరిహద్దుల్లో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న కొన్ని బలగాలను రష్యా వెనక్కి పిలిపించుకుంది. ఈ విషయాన్ని రష్యా రక్షణమంత్రిత్వశాఖ పేర్కొంది.
దేశవ్యాప్తంగా చేపట్టిన రక్షణ విన్యాసాలు కొనసాగుతున్నాయని, అయితే దక్షిణ, పశ్చిమ ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కి వస్తున్నట్టు స్థానిక మీడియాతో రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఆయుధ సామాగ్రిని ట్రక్కులో తీసుకెళ్లనున్నట్టు, సైనికులు నడక ద్వారా సరిహద్దు నుంచి తమ శిబిరాలకు వెళ్లనున్నట్టు స్పష్టం చేసింది.
ఈ వారంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందని అమెరికా, యూరోపియన్ యూనియన్లు హెచ్చరించిన తరుణంలో.. తాజా పరిణామాలు ఉద్రిక్తతలను కాస్త తగ్గించాయి. ఇప్పటికీ భయాలు వెంటాడుతున్నా.. యుద్ధం జరగకపోవచ్చు అనే సంకేతాలు కొంతమేర బలపడ్డాయి.
ఇదీ వివాదం..
Russia and Ukraine conflict reason | ఉక్రెయిన్, రష్యాలో సహజ వనరుల సంపద ఎక్కువగా ఉంటుంది. 1990 దశకంలో సోవియెట్ యూనియన్ కుప్పకూలిన తరుణంలో ఉక్రెయిన్ సొంతంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. అయితే ఉక్రెయిన్ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని రష్యా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌లో కొంత భాగం ప్రజలు రష్యాకు మద్దతుగా నిలుస్తుండటం ఆ దేశానికి కలిసివచ్చింది. 2014లో ఉక్రెయిన్ సరిహద్దుల్లోని క్రిమియాను ఆక్రమించుకుంది. ఆ సమయంలో ఉద్రిక్తలు పెరిగాయి. అప్పటి నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా.. రష్యా ప్రవర్తనతో విసుగెత్తిపోయిన ఉక్రెయిన్.. నాటోలో చేరాలని ఆలోచించడం మొదలుపెట్టింది. నాటోలో చేరితే భద్రతా దళాలన్నీ రష్యాతో సరిహద్దు వెంబడి తిష్టవేసుకుని కూర్చునే అవకాశముంది. ఈ విషయాన్ని గ్రహించిన రష్యా, తన ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని భావించింది. నాటోలో చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. అంతటితో ఆగకుండా.. 10లక్షలకుపైగా మంది సైనికులను సరిహద్దుల్లో మోహరించింది. ఉక్రెయిన్ ఉత్తర భాగంలోని బెలారస్లో సైనిక విన్యాసాలు చేపట్టింది. ఇలా ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
Russia Ukraine war | ఈ వ్యవహారాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాను హెచ్చరించింది. అయితే.. తాము దాడి చేయడం లేదని, సైనిక విన్యాసాల్లో భాగంగానే సైనికులు సరిహద్దుకు వెళ్లారని రష్యా ఇంతకాలం చెప్పుకొచ్చింది.
రష్యా చర్యలను పసిగట్టిన ప్రపంచ దేశాలు.. ఉక్రెయిన్ నుంచి తమ ప్రజలను వెనక్కి తెచ్చుకునే పనిలోపడ్డాయి. కానీ సైనికులను రష్యా వెనక్కి పిలిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితంగా యుద్ధం అనివార్యం అనుకున్న ప్రాంతంలో శాంతి స్థాపనకు అడుగులు పడే అవకాశం పెరిగింది.