Russia-Ukraine Crisis | వెంటనే వెళ్లిపోండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ సూచన
15 February 2022, 12:19 IST
- రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో చాలా దేశాలు తమ పౌరులను ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచిస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఎంబసీ కూడా అక్కడి భారతీయులకు ఇవే ఆదేశాలు జారీ చేసింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్
కీవ్: రేపుమాపో ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయబోతోందన్న ఆందోళనల నేపథ్యంలో అన్ని దేశాలు అలెర్ట్ అవుతున్నాయి. అమెరికా అయితే తమ ఎంబసీనే కీవ్ నుంచి తరలిస్తోంది. మరో 12 దేశాలు తమ పౌరులను హెచ్చరించాయి. ఇక మంగళవారం అక్కడి ఇండియన్ ఎంబసీ కూడా భారతీయులకు ఆదేశాలు జారీ చేసింది.
ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగానైనా దేశాన్ని వదిలి వెళ్లాలని సూచించింది. ముఖ్యంగా విద్యార్థులు అయితే వెంటనే ఆ పని చేయాలని స్పష్టం చేసింది. అమెరికా తమ ఎంబసీని కీవ్ నుంచి పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన ఎల్‌వివ్‌కు తరలిస్తున్నట్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని తగ్గించడానికి దౌత్యమార్గాన్ని అనుసరించాలని రెండు దేశాలకు సూచించారు.