తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Vs Ukraine | అసలు ఆ రెండు దేశాల మధ్య గొడవేంటి? యుద్ధ వాతావరణం ఎందుకు?

Russia vs Ukraine | అసలు ఆ రెండు దేశాల మధ్య గొడవేంటి? యుద్ధ వాతావరణం ఎందుకు?

Hari Prasad S HT Telugu

15 February 2022, 10:43 IST

    • ఉక్రెయిన్‌పై రష్యా ఎక్కడ దాడి చేసి ఆక్రమించుకుంటుందా అని ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తోంది. ఈ నెల 16నే యుద్ధమంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రష్యా కయ్యానికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని ఇప్పటికే అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సిద్ధంగా ఉంచిన యుద్ధ విమానాలు
ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సిద్ధంగా ఉంచిన యుద్ధ విమానాలు (AP)

ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సిద్ధంగా ఉంచిన యుద్ధ విమానాలు

మాస్కో: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, ఏ క్షణంలో అయినా యుద్ధం తప్పకపోవచ్చన్న వార్తలు రోజూ వస్తూనే ఉన్నాయి. లక్షమంది సైన్యాన్ని ఉక్రెయిన్‌ సరిహద్దులో రష్యా సిద్ధంగా ఉంచిందని, మిస్సైళ్లు ఆ దేశం వైపు గురి చూస్తున్నాయనీ చదువుతూనే ఉన్నాం. అయితే అసలు ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఎందుకు నెలకొంది? సమస్య ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

అప్పుడే బీజం పడింది

ఇప్పటి ఉక్రెయిన్‌ ఒకప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌లో భాగం. 1991లో సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచీ ఆ దేశం మెల్లగా పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాల కోసం చూస్తోంది. నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనేజేషన్‌)లో చేరాలని ఉబలాటపడుతోంది. 

అయితే రష్యా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2014లో యురోపియన్‌ యూనియన్‌తో ఒప్పందాన్ని వద్దన్న రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్‌ యానుకోవిచ్‌కు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. చివరికి ఆయన పదవి కోల్పోయారు. ఇది రష్యాకు మింగుడు పడలేదు. వెంటనే వివాదాస్పద క్రిమియా ప్రాంతంలో వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచింది. అక్కడి తిరుగుబాటుదారులకు రష్యా ఆయుధాలు, సైన్యాన్ని మద్దతుగా పంపిస్తోందని ఉక్రెయిన్‌తోపాటు పాశ్చాత్య దేశాలు ఆరోపించాయి. 

అయితే ఈ ఆరోపణలను ఖండించిన రష్యా.. వేర్పాటువాదుల్లో కొందరు రష్యన్లు స్వచ్ఛందంగా చేరారని వాదించింది. అమెరికా, నాటో దేశాలే ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపిస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్‌ మెల్లగా నాటోలో చేరాలని చూడటాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ వ్యతిరేకించారు. ఉక్రెయిన్‌లో నాటో సభ్యదేశాలు మిలిటరీ ట్రైనింగ్‌సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలపై ఆందోళన వ్యక్తం చేశారు.

రష్యా డిమాండ్‌ ఏంటి?

ఉక్రెయిన్‌ విషయంలో తమ భద్రతా డిమాండ్ల లిస్ట్‌ను గత డిసెంబర్‌లో అమెరికా ముందు ఉంచింది రష్యా. ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదని, రష్యా సరిహద్దులో నాటో డ్రిల్స్‌ వెంటనే నిలిపేయాలని అందులో డిమాండ్‌ చేసింది. నోటి మాటగా కాదు.. చట్టపరమైన హామీలు ఇవ్వాలని రష్యా స్పష్టం చేసింది. వీటిపై అటు అమెరికా, నాటోగానీ.. ఇటు రష్యాగానీ పబ్లిగ్గా ఏ ప్రకటనా చేయలేదు. అయితే వీటిలో చాలా డిమాండ్లను అమెరికా కొట్టి పారేసినట్లు తాజా ఉద్రిక్తతలను బట్టి స్పష్టమవుతోంది.

అసలేంటీ నాటో?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో ఏర్పడిన కూటమి ఇది. అప్పట్లో 12 దేశాలు ఈ కూటమిని ప్రారంభించాయి. ప్రస్తుతం ఇందులో 30 దేశాలు ఉన్నాయి. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నాటో హెడ్‌క్వార్టర్స్‌ ఉంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌తోపాటు చాలా వరకూ పశ్చిమ యూరప్‌ దేశాలు ఈ నాటో కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ కూడా ఇందులో చేరాలని అనుకుంటోంది. ఇది తమ భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందని రష్యా ఆందోళన చెందుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇప్పటికే నాటోలో ఉక్రెయిన్‌ చేరికకు మద్దతు పలకగా.. అధ్యక్షుడు జో బైడెన్‌ దీనిపై స్పష్టంగా ఏదీ చెప్పలేదు.

ఒకవేళ యుద్ధం జరిగితే..

ఇప్పుడు ఉక్రెయిన్‌పై దాడి చేసి ఆక్రమణకు రష్యా సిద్ధమవుతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు దానికి అండగా నిలుస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. జర్మనీ అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించనుంది. 

ఒకవేళ రష్యా యుద్ధానికి దిగితే ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు తప్పవని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తామని అటు యురోపియన్‌ దేశాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు డబ్బును బదిలీ చేసే SWIFT ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను తప్పించాలని భావిస్తున్నాయి. 

ఇదే జరిగితే రష్యా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తింటుంది. దేశ ఆదాయంలో 40 శాతం ఉండే అంతర్జాతీయ ఆయిల్‌, గ్యాస్‌ ఉత్పత్తి లాభాలు కూడా ఆగిపోతాయి. అంతేకాదు అమెరికా డాలర్‌ను రష్యా ఉపయోగించకుండా చేసే అతిపెద్ద ఆర్థిక ఆయుధం కూడా బైడెన్‌ దగ్గర ఉంది.

తదుపరి వ్యాసం