Ukraine Crisis | ఐక్యతా దినంగా ప్రకటించిన అధ్యక్షుడు
15 February 2022, 16:24 IST
UKRAINE CRISIS | ఫిబ్రవరి 16న రష్యా దాడి చేస్తుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ రోజును ఐక్యతా దినంగా ప్రకటించారు.
ఉక్రెయిన్‌కు ఉత్తర సరిహద్దుల్లో రష్యా తన ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకున్నట్టు తెలిపే మాక్సర్ టెక్నాలజీ చిత్రించిన శాటిలైట్ చిత్రం..
మాస్కో/కీవ్ : దేశ ప్రజలు ఫిబ్రవరి 16న ఉమ్మడిగా జాతీయ పతాకాలు ఎగురవేసి, జాతీయ గీతం ఆలపించి ఐక్యంగా నిలవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 16న రష్యా తమ దేశంపై దాడికి పాల్పడనుందని పాశ్ఛాత్య మీడియాలో వార్తలు వస్తున్న తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్కీ ఐక్యతకు పిలుపునిచ్చారు.
బుధవారం దాడి జరుగుతుందని జెలెన్స్కీ అంచనా వేయడం లేదని, విదేశీ మీడియాలో వస్తున్న వార్తలను విశ్వసించడం లేదని ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులు ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
‘ఫిబ్రవరి 16ను దాడి చేసే రోజుగా వారు చెబుతున్నారు. మనం దానిని ఐక్యతా దినంగా పాటిద్దాం..’ అని జెలెన్స్కీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఒక వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు.
‘సైనిక చర్యకు మరో తేదీని ప్రకటించడం ద్వారా వారు మమ్మల్ని భయోత్పాతానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు..’ అని జెలెన్స్కీ అన్నారు. ‘ఆరోజు మేం మా జాతీయ పతాకాలను ఎగురవేస్తూ, పసుపు, నీలి బ్యానర్లు ప్రదర్శిద్దాం. ఈ ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెబుదాం..’ అని వ్లాదిమర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు.
రష్యా తన దేశంపై దాడి చేస్తానని బెదిరిస్తోందని నమ్ముతన్నట్టు చెబుతోన్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌ను భయపెట్టడానికి, భయాందోళనలన వ్యాప్తిచేయడానికి మస్కో చేస్తున్న యత్నాలకు స్పందనగా, దాడి త్వరలోనే జరగబోతోందని పాశ్ఛాత్య మిత్రదేశాలు ఇంకా ఎక్కువ చేసి చూపుతున్నాయని అన్నారు.
జెలెన్స్కీ సలహాదారు మైఖైలో పొడొల్యాక్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ దాడి తేదీ వార్తలపై అధ్యక్షుడు వ్యంగ్యంతో ప్రతిస్పందించారని చెప్పారు.
‘దాడి ఫలానా తేదీన ప్రారంభమవుతుందంటూ మీడియాలో వచ్చిన ప్రకటనలకు ఉక్రెయిన్ పౌరులు ఎందుకు విశ్వసించడంలేదో అర్థం చేసుకోగలిగినవే..’ అని మైఖైల్ అన్నారు. ‘దండయాత్ర ప్రారంభానికి తేదీలు మారుతూ ఉంటే వాటిని వ్యంగ్యంగా మాత్రమే స్వీకరించగలం..’ అని అన్నారు.
అన్ని గ్రామాలు, పట్టణాలు బుధవారం ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాలు ఎగురవేసి జాతీయ గీతం ఆలపించాలని జెలెన్స్కీ కార్యాలయం ఒక ఉత్తర్వు జారీచేసింది. అలాగే సైనికులు, సరిహద్దు రక్షకుల వేతనాలు పెంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక నిర్ధిష్ట తేదీలో నిర్దేశించినట్టుగా దాడి జరగకపోవచ్చని, అయితే ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చని యూఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.