Dollar rate today: 44 పైసలు బలపడ్డ రూపాయి..
17 August 2022, 10:05 IST
Dollar rate today 17 august 2022: డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పుంజుకుంటోంది. ద్రవ్యోల్భణ భయాలు తగ్గుతుండడం, చమురు ధరలు క్రమంగా తగ్గుతుండడంతో రూపాయి పుంజుకుంటోంది.
అమెరికన్ కరెన్సీ డాలరుతో పోల్చితే పుంజుకుంటున్న రూపాయి (ప్రతీకాత్మక చిత్రం)
ముంబై ఆగస్టు 17: అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 44 పైసలు పెరిగి 79.30కి చేరుకుంది. ప్రధానంగా విదేశీ నిధుల ప్రవాహం రూపాయి బలోపేతానికి దోహదపడింది.
అంతేకాకుండా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతుండడంతో దేశీయ ఈక్విటీలలో సానుకూలత ప్రారంభమవడం పెట్టుబడిదారుల సెంటిమెంట్లను పెంచిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద డాలర్‌తో రూపాయి 79.32 వద్ద ప్రారంభమైంది. క్రమంగా 44 పైసలు పెరిగి 79.30కి చేరుకుంది.
శుక్రవారం నాటి సెషన్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 79.74 వద్ద ముగిసింది.
స్వాతంత్య్ర దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరానికి సంబంధించి ఫారెక్స్ మార్కెట్లు వరుసగా సోమవారం, మంగళవారం మూసిఉన్నాయి.
ఆరు కరెన్సీలతో డాలర్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.06 శాతం క్షీణించి 106.44కి చేరుకుంది.
ఇక ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.34 శాతం పెరిగి 92.65 డాలర్లకు చేరుకుంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 1,376.84 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
గత నెల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించారు. ఆగస్టు మొదటి రెండు వారాల్లో రూ. 22,452 కోట్ల విలువైన ఈక్విటీ పెట్టుబడులు పెట్టారు.
కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్ లాభాల్లో ఉంది. సెన్సెక్స్ 131.78 పాయింట్లు (0.22 శాతం) పెరిగి 59,973.99 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 49.15 పాయింట్లు (0.28 శాతం) పురోగమించి 17,874.40 పాయింట్లకు చేరుకుంది.
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జులైలో ఐదు నెలల కనిష్టానికి తగ్గి 13.93 శాతంగా నమోదైంది.