Reliance AGM live : ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి రిలయన్స్
29 August 2022, 15:40 IST
- Reliance AGM live : రిలయన్స్ ఏజీఎం నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాదిలో ఎఫ్ఎంసీజీ రంగంలోకి అడుగుపెట్టనున్నట్టు రిలయన్స్ రీటైల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఇషా అంబానీ ప్రకటించారు.
ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి రిలయన్స్
Reliance AGM live : ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) వ్యాపారంలోకి ఈ ఏడాదిలో అడుగుపెడుతున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఈ మేరకు.. రిలయన్స్ ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో పాల్గొన్న ఆ సంస్థ రీటైల్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు.
"ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని ఈ ఏడాది లాంచ్ చేస్తున్నాము అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అత్యంత నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తయారు చేసి, డెలివరీ చేసి ప్రతి భారతీయుడి అవసరాలను తీర్చడమే మా ముఖ్య ఉద్దేశం," అని ఇషా అంబానీ పేర్కొన్నారు.
Reliance FMCG : ఈ ఏడాదిలో రిలయన్స్ రీటైల్.. 2500కుపైగా స్టోర్స్‌ను తెరిచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా 15వేలకుపైగా రిలయన్స్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. రిలయన్స్ రీటైల్ విభాగం ద్వారా ఈ ఒక్క ఏడాదిలోనే 1,50,000మందికి ఉద్యోగాలి ఇచ్చినట్టు ఇషా అంబానీ స్పష్టం చేశారు. మొత్త మీద తమ వద్ద 3.6లక్షలకుపైగా మంది ఉద్యోగులు ఉన్నట్టు పేర్కొన్నారు.
"ఈ ఏడాదిలో ఇప్పటివరకు మా బ్రాండ్స్‌ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాము. ఎన్నో కొత్త ప్రాడక్టులను ప్రవేశపెట్టాము. వాట్సాప్-జియో మార్ట్ సేవలను కూడా లాంచ్ చేశాము," అని ఇషా అంబానీ అన్నారు.
Reliance retail : "రానున్న 10ఏళ్ల కాలానికి బ్లూప్రింట్‌ను తయారు చేస్తోంది రిలయన్స్. అది పూర్తి అయిన తర్వాత.. మీతో పంచుకుంటాను. రిలయన్స్‌ను మరింత ప్రభావవంతంగా, మరింత భారీగా తీర్చిదిద్దేందుకు అందరం కృషిచేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తల్లికి కృతజ్ఞతలు," అంటూ రిలయన్స్ ఏజీఎంలో తన ప్రసంగాన్ని ముగించారు ఇషా అంబానీ.
రిలయన్స్ ఏజీఎం వరుసగా మూడోసారి.. వర్చువల్‌గా జరిగింది. దేశంలోని అతిపెద్ద సంస్థల్లో రిలయన్స్ ఒకటి కావడంతో.. సంస్థ ఏజీఎంపై అటు పెట్టుబడిదారుల్లో, ఇటు ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి.
వాట్సాప్‌లో షాపింగ్..
వాట్సాప్‌లో తొలిసారిగా షాపింగ్ అనుభూతిని తీసుకొస్తున్నట్టు.. మెటా(ఫేస్బుక్)- జియో సోమవారం ప్రకటించాయి. వాట్సాప్ ఛాట్ నుంచి జియోమార్ట్‌లో షాపింగ్ చేసే వ్యవస్థను తీసుకొస్తున్నట్టు పేర్కొన్నాయి.
Jio Meta shopping : "ఇది ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతోంది. వాట్సాప్‌లోని జియోమార్ట్ సేవలతో.. గ్రాసరీలు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎప్పుడూ షాపింగ్ చేయని వారికి కూడా ఇది మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రత్యేక యాప్‌ల ద్వారా ఇప్పుడు గ్రాసరీలు కొనుగోలు చేస్తున్నారు. కానీ మా వ్యవస్థతో.. వాట్సాప్‌లోనే షాపింగ్ చేసుకోవచ్చు," అని రిలయన్స్ రీటైల్ సోమవారం ఓ అధికారిక ప్రకటనను వెలువరించింది.
మెటా- జియో మధ్య కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ ఫీచర్‌ని తీసుకొస్తున్నట్టు రిలయన్స్ పేర్కొంది.