తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: “ఫోన్‍లో జాగ్రత్త అని హెచ్చరించారు”: రాహుల్ గాంధీ

Rahul Gandhi: “ఫోన్‍లో జాగ్రత్త అని హెచ్చరించారు”: రాహుల్ గాంధీ

03 March 2023, 10:41 IST

google News
    • Rahul Gandhi at Cambridge University: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు.
Rahul Gandhi: “ఫోన్‍లో జాగ్రత్త అని హెచ్చరించారు”: రాహుల్ గాంధీ
Rahul Gandhi: “ఫోన్‍లో జాగ్రత్త అని హెచ్చరించారు”: రాహుల్ గాంధీ (HT_PRINT)

Rahul Gandhi: “ఫోన్‍లో జాగ్రత్త అని హెచ్చరించారు”: రాహుల్ గాంధీ

Rahul Gandhi at Cambridge University: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ (Congress) ముఖ్య నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఆరోపణాస్త్రాలు సంధించారు. యూకేలోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు. భారత ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణంపై దాడి జరుగుతోందని అన్నారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్‍ (Pegasus)పై రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‍లోనూ పెగాసస్ ఉందని, ప్రభుత్వం నిఘా ఉంచిందని ఆరోపించారు. పెగాసస్ గురించి తనకు హెచ్చరికలు కూడా వచ్చాయని రాహుల్ గాందీ అన్నారు. పూర్తి వివరాలు ఇవే.

నా ఫోన్‍లోనూ పెగాసస్

Rahul Gandhi at Cambridge University: “నా ఫోన్‍లోనూ పెగాసస్ ఉంది. చాలా మంది రాజకీయ నేతల ఫోన్‍లలోనూ పెగాసస్ ఉంది. కొందరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నాకు ఫోన్ చేశారు. ఫోన్‍లో ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాము కాల్స్ రికార్డ్ చేస్తున్నామని నాతో చెప్పారు. అందుకే మేం ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం. ప్రతిపక్షంపై కేసులు నమోదవుతున్నాయి. అన్నింటినీ ఎదుర్కొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం” అని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ లెక్చర్‌లో రాహుల్ గాంధీ అన్నారు. కేంబ్రిడ్జ్‌ జడ్జ్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వీడియో లింక్‍ను కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా ట్వీట్ చేశారు.

ఒత్తిడిలో ప్రజాస్వామ్యం

Rahul Gandhi at Cambridge University: భారత దేశ ప్రజాస్వామ్యం ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని అందరికీ తెలుసునని రాహుల్ గాంధీ అన్నారు. “భారత ప్రజాస్వామ్యం ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని, దాడికి గురవుతోందని అందరికీ తెలుసు. దేశంలో అన్ని వ్యవస్థలు నిర్బంధానికి లోనవుతున్నాయి” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) గురించి కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రసంగంలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. యాత్రలో ప్రజల చేతులను పట్టుకొని నడిచానని, వారు తనను సోదరుడిగా నమ్మారని చెప్పారు. రాజకీయ నేతగా తన దృక్పథాన్ని ప్రజలు మార్చారని రాహుల్ అన్నారు.

నిఘా కోసం పెగాసస్‍ను ప్రభుత్వం ఉపయోగిస్తోందన్న ఆరోపణలపై గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించింది. అయితే తాము పరీక్షించిన 29 మొబైళ్లలో ఎలాంటి స్పైవేర్ లేదని ఆ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఐదు ఫోన్‍లలో మాల్వేర్ ఉందని చెప్పింది. అయితే పెగాసస్ స్పైవేర్ ఏ మొబైల్‍లోనూ లేదని ఆ కమిటీ నిర్ధారించింది.

తదుపరి వ్యాసం