Rahul Gandhi: “ఇది సావర్కర్ సిద్ధాంతం: దీన్ని మీరు జాతీయవాదం అంటారా?”: రాహుల్ గాంధీ విమర్శలు
Rahul Gandhi: చైనా విషయంలో కేంద్ర మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. సావర్కర్ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడారు.
Rahul Gandhi: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా ఆర్థిక వ్యవస్థ పెద్దది అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాహుల్.. ఆరోపణలు చేశారు. దీన్ని జాతీయవాదం అంటారా అంటూ ప్రశ్నించారు. రాయ్‍పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో (Congress 85th Plenary Sessions) ఆదివారం మాట్లాడారు రాహుల్. కేంద్రంపై మాటల దాడి చేశారు. “చైనా కంటే ఇండియా ఆర్థిక వ్యవస్థ చిన్నదని ఓ ఇంటర్వ్యూలో ఓ మినిస్టర్ చెప్పారు. వారితో మనం ఎలా పోరాడగలం? అని అన్నారు. మనం బ్రిటిషర్లతో పోరాడినప్పుడు వారి కన్నా మన ఆర్థిక వ్యవస్థ పెద్దదా? ఇది పిరికితనమే” అని రాహుల్ అన్నారు. చైనాతో పోరాటం విషయంలో ఆర్థిక వ్యవస్థను ప్రస్తావించటంపై రాహుల్ చురకలు అంటించారు.
ఇది సావర్కర్ సిద్ధాంతం
Rahul Gandhi: “మీ కన్నా బలమైన వారి ముందు తలవంచి ఉండాలన్నది సావర్కర్ సిద్ధాంతం. మీ కన్నా బలహీనులపైనే మీరు పోరాడతారా? దీన్ని పిరికితనం అంటారు” అని రాహుల్ అన్నారు. “మీరు మా కన్నా బలవంతులు కాబట్టి మీ ముందు మేం నిలబడలేమని భారత్‍కు చెందిన ఓ మంత్రి.. చైనాకు చెప్పారు. ఇది జాతీయవాదమా?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో దూకుడుగా యుద్ధానికి కాలుదువ్వడం కామన్స్ సెన్స్ అనిపించుకోదంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో వ్యాఖ్యలు చేశారు.
నిజం వచ్చే వరకు అడుగుతూనే ఉంటాం
Rahul Gandhi: అదానీ గ్రూప్ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించారు రాహుల్ గాంధీ. “గౌతమ్ అదానీతో ప్రధాని మోదీ బంధం గురించి పార్లమెంటులో అడిగినప్పుడు మొత్తం ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించారు. అదానీ గురించి నిజం బయటికి వచ్చే వరకు వేలసార్లు పార్లమెంట్‍లో మేం అడుగుతూనే ఉంటాం. మేం అసలు ఆగం. మీ కంపెనీ వల్ల దేశం నష్టపోతోందని నేను అదానీకి చెప్పదలచుకున్నా. దేశంలోని ఇన్‍ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ అదానీ కంపెనీ గుప్పిట్లో పెట్టుకుంటోంది” అని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ నుంచి దేశ సంపదను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ అంతా పోరాడుతుందని రాహుల్ అన్నారు.
మరోవైపు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పిలుపునిచ్చారు. 2024 లోక్‍సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉందని, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, వ్యక్తులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
సంబంధిత కథనం