Punjab Congress | సీఎం కుర్చీ కోసం కుమ్ములాట.. చివరికి అధికారమే మాయం!
21 March 2022, 13:49 IST
- Punjab election result | ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారపక్షంగా కాంగ్రెస్ దిగిన ఏకైక రాష్ట్రం ‘పంజాబ్.’ ఇక తాజా ఫలితాలతో.. కాంగ్రెస్‌ను ఆప్ చిత్తు, చిత్తుగా ఓడించింది. తీవ్ర పరాభవం ముంగిట కాంగ్రెస్ నిలబడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ స్వయంకృతమే. ఆ పార్టీ ఓటమికి అంతర్గత కమ్ములాటలతో పాటు ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఓటమి అంచున పంజాబ్ కాంగ్రెస్
Punjab Congress news | ఐదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో.. మరో ఘోర పరాభవం ముందు కాంగ్రెస్ నిలబడింది. కోటి ఆశలు పెట్టుకున్న 'పంజాబ్' సైతం కాంగ్రెస్ చేతిలో నుంచి జారిపోయింది. ఐదు రాష్ట్రాల్లో అధికారపక్షంగా బరిలో దిగిన ఏకైక రాష్ట్రం పంజబ్‌లో కాంగ్రెస్ డీలా పడింది. కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తు, చిత్తుగా ఓడిపోయారు.
117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 59 సీట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆప్ 90 సీట్లల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందుంది. ఈ నెంబర్లు చాలు కాంగ్రెస్ స్థితి ఎలా ఉందో చెప్పేందుకు. అయితే కాంగ్రెస్‌కు ఇది స్వయంకృతం అనే చెప్పుకోవాలి. అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తీశాయి.
సిద్ధూ కోసం..
వాస్తవానికి సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో 2017 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచింది కాంగ్రెస్. కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌పై కోటీ ఆశలతో ప్రజలు ఓట్లేశారు. తొలుత అంతా సాఫీగానే సాగిపోయినా.. కొన్ని నెలల తర్వాత.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో అవి మరింత తీవ్రమయ్యాయి.
Navjot Singh Sidhu election result | 2020 నుంచి అధికారపక్షంలో కుమ్ములాటలు పరిష్కరించలేని స్థాయికి చేరాయి. అమరీందర్- సిద్ధూ మధ్య విభేదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పార్టీలో ఆధిపత్యం కోసం సిద్ధూ చేసిన ప్రయత్నాలు కెప్టెన్‌కు నచ్చలేదు. వీరి వ్యవహారం హైకమాండ్‌కు కత్తిమీద సాముగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు చాలా నెలలే పట్టింది. చివరికి ఇద్దరు శాంతించారనే అందరు అనుకున్నారు.
కానీ ఇద్దరు కీలక నేతల మధ్య కాంగ్రెస్ కుదుర్చిన సంధి.. ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. వీటిని ప్రజలు చూస్తూనే ఉన్నారు కూడా.
ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అమరీందర్ తీసుకున్న కీలక నిర్ణయం కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధూతో గొడవ వేళ కాంగ్రెస్‌తో సీనియర్ నేత అమరీందర్ తెగదెంపులు చేసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వేరే పార్టీ పెట్టారు. వెళ్తూ వెళ్తూ.. కాంగ్రెస్‌పై, సిద్ధూ మీద తీవ్ర విమర్శలు చేసి వెళ్లారు. 'సిద్ధూ ఓ ఉగ్రవాది, పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయి,' అంటూ ఆరోపణలు చేశారు. అత్యంత సీనియర్ నేత అమరీందర్ వెళ్లిపోతుంటే.. కాంగ్రెస్ చూస్తూ ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది సిద్ధూ కోసం అమరీందర్‌ను రాహుల్ గాంధీ వదులుకున్నట్టే!
Punjab Congress cm face | అప్పుడు సిద్ధూకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అందరు భావించారు. కానీ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్ హైకమాండ్. దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఆ బాధ్యతలు అప్పగించింది. సిద్ధూకు పీసీసీ పదవి కట్టబెట్టింది. ఎన్నికల్లో ఇది తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది.
ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చన్నీ, సిద్ధూల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఒక రకంగా చెప్పాలంటే.. చన్నీ, సిద్ధూల వర్గాలు రెండుగా చీలిపోయాయి. 'ఎవరిని అభ్యర్థి చేసినా.. అందరం కలిసే ఉంటాము,' అని ఇద్దరు బయటకు చెప్పినా, అంతర్గత కలహాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. మరోమారు వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్.. చన్నీని సీఎం అభ్యర్థిగా నిలబెట్టారు.
సిద్ధూకు మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే ఎన్నికలన్న విషయాన్ని సైతం విస్మరించిన సిద్ధూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'హైకమాండ్‌కు వారు చెప్పింది చేసే నాయకుడే కావాలి,' అని మండిపడ్డారు. ప్రజల నిర్ణయంపై ఇది కచ్చితంగా ప్రభావం చూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో చరణ్‌జిత్ సింగ్ చన్నీ(రెండు సీట్లల్లో పోటీ చేశారు), సిద్ధూలు ఇద్దరూ ఓటమిపాలయ్యారు.
డ్రగ్స్.. నిరుద్యోగం..
Congress in Punjab elections | ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలిపిన రోజులు కూడా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. దారుణంగా పెరిగిపోయింది. నియంత్రించలేని స్థితికి చేరింది. పిల్లలు డ్రగ్స్‌కు బానిసవుతుంటే.. తల్లిదండ్రులు చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ దారుణాలను ఆపండని వేడుకున్నారు. కానీ వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపణలు వినిపించాయి.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులకు మద్దతించింది కాంగ్రెస్. ఈ ఒక్క విషయం మినహా.. మిగితా వాటిల్లో రైతులు కూడా కాంగ్రెస్‌పై అసంతృప్తిలో ఉన్నట్టు పలు వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.
టాపిక్