Punjab Results 2022 | పంజాబ్‌లో ఆప్ సంచలనం
10 March 2022, 16:42 IST
పంజాబ్ అసెంబ్లీ 2022 ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేసే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ తరువాత ఆమ్ ఆద్మీ అధికారంలోకి రానున్న రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలవనుంది.
లుధియానాలోని కౌంటింగ్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత
చండీగఢ్: పంజాబ్ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఫలితాల్లో ఆప్ హవా కనిపించింది. 18 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో శిరోమణి అకాళీదళ్ లీడ్‌లో ఉన్నాయి. బీజేపీ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. బీఎస్పీ 1 స్థానంలో పాగా వేసే అవకాశం ఉంది.
పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
రాష్ట్రంలోని 66 చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద 7500 మంది సిబ్బంది, 45 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు దృష్ట్యా, అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల వెలుపల ప్రజలు గుమిగూడడంపై నిషేధం ఉంది.
పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈసారి రాష్ట్రంలో ప్రధాన పోటీదారుగా అవతరించడమే కాకుండా సంచలన విజయం నమోదు చేసింది.
అనేక పోస్ట్ పోల్ సర్వేలు ఆప్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేయగా, కొన్ని హంగ్ అసెంబ్లీని అంచనా వేశాయి. ఈసారి 93 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు సహా మొత్తం 1,304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రాష్ట్రంలో ఈసారి 71.95 శాతం పోలింగ్ నమోదైంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది.