Punjab election result | సీఎం, మాజీ సీఎంలకు ప్రజలు భారీ షాక్
10 March 2022, 17:07 IST
- పంజాబ్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్‌లకు ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. ఇక అమరీందర్ సైతం ఓడిపోయారు.
అమరీందర్ సింగ్- చరణ్‌జీత్ సింగ్ చన్నీ
Punjab election results | పంజాబ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా.. కాంగ్రెస్ 'కోటి' ఆశలు పెట్టుకున్న చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. పోటీ చేసిన రెండు సీట్లల్లోనూ ఓటమిపాలయ్యారు. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ దఫా ఎన్నికల్లో చన్నీ రెండు సీట్లల్లో(చంకౌర్ సాహెబ్, బదౌర్) పోటీ చేశారు. కానీ ఒక్క స్థానంలోనూ ఖాతా తెరవలేదు. బదౌర్‌లో.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లభ్ సింగ్ చేతిలో చన్నీ ఓడిపోయారు. లభ్ సింగ్‌కు 57వేల పైచిలుకు ఓట్లు రాగా.. చన్నీ 23వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు.
Charanjit Singh Channi defeated | ఇక మరో సీటులో చన్నీపై అదే పేరు ఉన్న ఆప్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ గెలిచారు. వీరి మధ్య దాదాపు 5వేల ఓట్ల తేడా ఉన్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి చన్నీపై కాంగ్రెస్ కోటి ఆశలు పెట్టుకుంది. దళిత నేత.. ఓట్లు తెచ్చిపెడతాడని.. తొలుత ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత సీఎం అభ్యర్థిగా నిలబెట్టింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా.. దళిత మంత్రంతో హైకమాండ్ చన్నీకి ఓటేసింది. కానీ ప్రజలు మాత్రం ఆయనకు ఓటు వేయలేదు. ఇది పంజాబ్ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది.
అమరీందర్ సింగ్ కూడా..
Amarinder Singh seat | ఇక మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ది కూడా ఇదే పరిస్థితి. పాటియాలా నుంచి పోటీ చేసిన కెప్టెన్.. ప్రత్యర్థి, ఆప్ అభ్యర్థి అజిత్‌పాల్ కోహ్లీ చేతిలో ఓటమిపాలయ్యారు. దాదాపు 20వేల ఓట్ల తేడాతో అమరీందర్ ఓడిపోవడం గమనార్హం. ప్రజల నిర్ణయాన్ని స్వీకరిస్తున్నట్టు అమరీందర్ వెల్లడించారు.
సిద్ధూతో విభేదాలతో కాంగ్రెస్‌కు, సీఎం పదవికి రాజీనామా చేసి బయటకొచ్చారు అమరీందర్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించారు. కానీ ఆయనే గెలవలేకపోయారు. ఇక ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉంది.
సిద్ధూ పరిస్థితి..
Navjot Singh Sidhu election | నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమి పాలయ్యారు. సీద్ధూకు 32,929 సీట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి, ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్‌కు 39,520 సీట్లు వచ్చాయి.
ఓటమిపై సిద్ధూ స్పందించారు. ‘ప్రజల మాట.. దేవుడి మాటతో సమానం. నేను స్వీకరిస్తున్నాను,’ అని అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.
పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, అమరీందర్- చన్నీలతో విభేదాలతో సిద్ధూ పేరు నిత్యం వార్తల్లో ఉండేది. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసేవారు సిద్ధూ. ఎన్నికలు సమీపించినా ఆయన వైఖరి మారలేదు. సీఎం అభ్యర్థిగా తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన.. హైకమాండ్‌పై ప్రత్యక్షంగానే విమర్శలు చేశారు.
ఇక ప్రస్తు పంజాబ్ ఎన్నికల ఫలితాలలో పంజాబ్‌లో ఆప్ దూసుకెళుతోంది. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం.