Elections news : ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికలకు రంగం సిద్ధం- పూర్తి వివరాలు..
06 November 2023, 17:30 IST
- Elections news : మిజోరం, ఛత్తీస్‌గడ్‌లో పోలింగ్ కోసం ఎన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎన్నికల సంఘం. మంగళవారం నాడు ఈ రెండు రాష్ట్రాలు పోలింగ్‌కు వెళ్లనున్నాయి. పూర్తి వివరాలు..
ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికలకు రంగం సిద్ధం
Elections news : 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. తొలుత.. మిజోరం, ఛత్తీస్‌గఢ్ (తొలి దశ) రాష్ట్రాలు మంగళవారం నాడు ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ వివరాలు..
మిజోరం అసెంబ్లీ ఎన్నికలు..
మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీకి 21 సీట్లు అవసరం. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రెంట్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 26 సీట్లల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌కు 5 సీట్లు, బీజేపీకి ఒక సీటు వచ్చింది.
ఇక 2023 మిజోరం అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో టైమింగ్స్ మారొచ్చు. కాగా.. ఈసారి.. 40 సీట్ల కోసం 174మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 8,53,088 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,13,064మంది పురుషులు, 4,39,028 మంది మహిళలు ఉన్నారు. వీరందరిలో తొలిసారి ఓటు వేస్తున్న వారి (18-19ఏళ్లు) సంఖ్య 50,611గా ఉంది. 80ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో 8490మంది ఉన్నారు.
Mizoram assembly elections 2023 : ఓటింగ్ కోసం 1276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 24 థోరంగ్ (ఎస్టీ) నియోజకవర్గం పరిధిలో థెలెప్ పోలింగ్ స్టేషన్లో అత్యల్పంగా 26 మంది ఓటర్లే ఉన్నారు. ఐజ్వాల్ ఈష్ట్ (జెనరల్) నియోకవర్గంలోని 24 జెమంబ్వాంక్ పోలింగ్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 1481 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాష్ట్రంలోని 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా ప్రకటించారు అధికరాలు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు 50కిపైగా సీఏపీఎఫ్ బలగాలను మోహరించారు అధికారులు. వీరితో పాటు రాష్ట్ర పోలీసులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికలు..
మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. వీటికి 2 దశల్లో పోలింగ్ జరగనుంది. మంగళవారం నాడు.. 20 సీట్లు పోలింగ్‌కు వెళ్లనున్నాయి. మిగిలిన 70 సీట్లకు ఈ నెల 17 ఎన్నికలు జరగనున్నాయి.
కాగా.. ఈ 20 సీట్ల కోసం 223 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 198మంది పురుషులు, 25మంది మహిళలు ఉన్నారు.
Chhattisgarh assembly elections 2023 : తొలి దశలో భాగంగా పోలింగ్‌కు వెళుతున్న నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే.. అధికారులు, ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. 20 నియోజకవర్గాల్లో 5,304 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఓటింగ్ పూర్తయ్యేంత వరకు ఇవి భద్రతాధికారుల నిఘాలో ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో టైమింగ్స్.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటలకుగా ఉన్నాయి.
ఇక ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం మీద 5,61,36,229మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,63,829మంది తొలిసారి (18-19ఏళ్లు) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 90 సీట్లల్లో 68 చోట్ల గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఫలితాలు ఎప్పుడంటే..
5 states assembly elections 2023 : మిజోరం, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఈ నెలలో మరో 3 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అవి.. తెలంగాణ (నవంబర్ 30), మధ్యప్రదేశ్ (నవంబర్ 17), రాజస్థాన్ (నవంబర్ 25). ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకేసారి, అంటే.. డిసెంబర్ 3న వెలువడనున్నాయి.