Telangana Election 2023 : టార్గెట్ గులాబీ బాస్... కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి..?
05 November 2023, 8:12 IST
- Telangana Assembly Election 2023: అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం జెండా ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్… అందుకు తగ్గట్టే అడుగులు వేసే పనిలో పడింది. ఇప్పటికే మెజార్టీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించగా… కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి విషయంలో రేవంత్ రెడ్డిని అస్త్రంగా ప్రయోగించాలని చూస్తోంది.
కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి...?
Telangana Assembly Election 2023: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కదనరంగంలోకి దిగగా… ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓవైపు గూలాబీ బాస్ కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటనలకు వెళ్తుండగా… మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సభలతో రేసులో స్పీడ్ పెంచింది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్… ఏ క్షణమైనా మూడో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో కీలకమైన కామారెడ్డితో పాటు పలు స్థానాలకు సంబంధించి క్లారిటీ రానుంది. ఇదే సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి విషయంలో సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
టార్గెట్ కేసీఆర్…!
ఈ ఎన్నికల యుద్ధంలో నేరుగా కేసీఆర్ ను ఢీకొట్టాలని చూస్తోంది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కేసీఆర్. అయితే కామారెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇక్కడ్నుంచి పార్టీ సీనియర్ నేత షబీర్ అలీ పోటీ చేస్తారని అంతా భావించినప్పటికీ…. హైకమాండ్ ఆలోచన మరోలా ఉందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే ఇక్కడ్నుంచి బరిలోకి దింపి… కేసీఆర్ ను ఢీకొట్టాలని చూస్తుందంట..! మొదటి జాబితాలోనే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పేరు ఖరారు కాగా…. కామారెడ్డి నుంచి కూడా ఆయన పేరును ఖరారు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పై పోటీకి రేవంత్ కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇవాళే మూడో జాబితా…?
ప్రకటించాల్సిన 19 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ నుంచి అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇక కీలకమైన సూర్యాపేట, తుంగతుర్తి, పటాన్ చెరు స్థానాల్లో అభ్యర్థులు ఎవరు ఉంటారనేది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. మూడో జాబితాలో తీన్మార్ మల్లన్న పేరు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.
పలు నియోజకవర్గాల్లో పోటీ చేసే 100 మంది అభ్యర్థులను ప్రకటించగా… ఒక్కరిద్దరిని మార్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోనూ కూడా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.