Assembly elections 2023 : మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ..
07 November 2023, 7:26 IST
- Mizoram elections 2023 : మిజోరంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మిజోరంలో 40 సీట్లు ఉండగా.. తొలి దశలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో 20 సీట్లల్లో పోలింగ్ జరగనుంది.
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ..
Mizoram elections 2023 : 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరానికి తొలి ఘట్టం మొదలైంది! మిజోరంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని (తొలి దశ) కొన్ని ప్రాంతాల్లో.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ..
2023 మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో.. 40 సీట్ల కోసం 174మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 8,53,088 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,13,064మంది పురుషులు, 4,39,028 మంది మహిళలు ఉన్నారు. వీరందరిలో తొలిసారి ఓటు వేస్తున్న వారి (18-19ఏళ్లు) సంఖ్య 50,611గా ఉంది. 80ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో 8490మంది ఉన్నారు.
ఓటింగ్ కోసం 1276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 24 థోరంగ్ (ఎస్టీ) నియోజకవర్గం పరిధిలో థెలెప్ పోలింగ్ స్టేషన్లో అత్యల్పంగా 26 మంది ఓటర్లే ఉన్నారు. ఐజ్వాల్ ఈష్ట్ (జెనరల్) నియోకవర్గంలోని 24 జెమంబ్వాంక్ పోలింగ్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 1481 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాష్ట్రంలోని 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా ప్రకటించారు అధికరాలు.
Mizoram elections live updates : మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీకి 21 సీట్లు అవసరం. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రెంట్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 26 సీట్లల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌కు 5 సీట్లు, బీజేపీకి ఒక సీటు వచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్..
మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. వీటికి 2 దశల్లో పోలింగ్ జరగనుంది. మంగళవారం నాడు.. 20 సీట్లు పోలింగ్‌కు వెళ్లనుండగా.. కోంటా నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మిగిలిన నియోజకవర్గాలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభంకానుంది.
మిగిలిన 70 సీట్లకు ఈ నెల 17 ఎన్నికలు జరగనున్నాయి.
Chhattisgarh elections 2023 : కాగా.. ఈ 20 సీట్ల కోసం 223 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 198మంది పురుషులు, 25మంది మహిళలు ఉన్నారు.
తొలి దశలో భాగంగా పోలింగ్‌కు వెళుతున్న నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే.. అధికారులు, ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. 20 నియోజకవర్గాల్లో 5,304 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఓటింగ్ పూర్తయ్యేంత వరకు ఇవి భద్రతాధికారుల నిఘాలో ఉంటాయి.
ఇక ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం మీద 5,61,36,229మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,63,829మంది తొలిసారి (18-19ఏళ్లు) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అయితే.. నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్న సుక్మాలోని తొండమర్క ప్రాంతంలో ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఓ జవానుకు సమీపంలో ఓ ఐఈడీ బాంబు పేలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో జవానుకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం.
Chhattisgarh elections 2023 live updates : 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 90 సీట్లల్లో 68 చోట్ల గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఫలితాలు వచ్చేది ఎప్పుడంటే..
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఈ నెలలో మరో 3 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అవి తెలంగాణ (నవంబర్ 30), మధ్యప్రదేశ్ (నవంబర్ 17), రాజస్థాన్ (నవంబర్ 25). ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకేసారి, అంటే.. డిసెంబర్ 3న వెలువడనున్నాయి.