PM Modi France visit : ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం!
14 July 2023, 7:16 IST
PM Modi France visit : ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారం మోదీని వరించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం!
PM Modi France visit : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీని.. ఆ దేశ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ మేరకు “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్”ను మోదీకి అందించారు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.
ఫ్రాన్స్ మిలిటరీ, పౌర పురస్కారాల్లో ఇదే అత్యుత్తమమైనది. ఇక ఓ భారత ప్రధానికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి. ఎలిసీ ప్యాలెస్‌లో గురువారం మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు మేక్రాన్. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
"ఫ్రాన్స్ దేశ ఆత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హైనర్ను ప్రధాని మోదీకి ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అందించారు. కోట్లాది మంది భారతీయుల తరఫున మేక్రాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు," అని భారత విదేశాంగశాఖ ట్వీట్ చేసింది.
గతంలో కేవలం కొంతమంది ప్రముఖులకే ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ ఛార్లెస్, ఫ్రాన్స్ మాజీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, మాజీ యూఎన్ ప్రధాన కార్యదర్శి బుట్రోస్ బుట్రోస్ ఘాలిలు ఈ జాబితాలో ఉన్నారు.
Grand Cross of the Legion of Honour : 2023లో మోదీకి ఇప్పటికే నైల్ ఆఫ్ ఈజిప్ట్, ఆర్డర్ ఆప్ పపువా గినియా, కంపానియన్ ఆఫ్ ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ నుంచి ఇబక్ అవార్డ్ వంటి అరుదైన పురస్కారాలు దక్కాయి. వీటితో పాటు మరెన్నో పురస్కారాలను గత కొన్నేళ్లలో మోదీ దక్కించుకున్నారు.
ఫ్రాన్స్‌లో యూపీఐ..
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. గురువారం భారత సమాజంతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో యూపీఐపై కీలక విషాయన్ని వెల్లడించారు.
UPI in France : "ఫ్రాన్స్‌లో యూపీఐని వినియోగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రానున్న రోజుల్లో ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ సేవలు ప్రారంభమవుతాయి. అంటే.. ఇక్కడ పర్యటనకు వచ్చే భారతీయులు.. ఇండియన్ కరెన్సీలో డబ్బులు చెల్లించవచ్చు," అని మోదీ అన్నారు.
భూటాన్, యూఏఈ, నేపాల్‌లో ఇప్పటికే యూపీఐ సేవలు అందుబాటులో ఉంది. అమెరికా, పశ్చిమాసియా, యూరోప్లలోనూ యూపీఐ సేవలను విస్తరించాలని భారత దేశం భావిస్తోంది.