Central Cabinet Reshuffle : కేంద్ర కేబినెట్ కూర్పుపై మోదీ కసరత్తులు, బండి సంజయ్ కు ఛాన్స్ ఇస్తారా?
Central Cabinet Reshuffle : ఈ నెల 12న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం 22 మందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరికి అదృష్టం వరిస్తుందో? అని ఆసక్తి నెలకొంది.
Central Cabinet Reshuffle : కేంద్ర కేబినెట్ లో మార్పులు ఖాయంగా కనిపిస్తుంది. ఈ నెల 12న కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 13వ తేదీన ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. మోదీ విదేశీ పర్యటనకు ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఆయన స్థానంలో తెలంగాణ నుంచి బండి సంజయ్, సోయం బాపూరావు, కె.లక్ష్మణ్ ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ నుంచి సీఎం రమేష్ కు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ కేంద్ర కేబినెట్ లో ఏపీకి స్థానం కల్పించకపోవడంతో... తాజా మంత్రివర్గ విస్తరణలో ఏపీ బీజేపీ నేతలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన బండి సంజయ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆయనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. అయితే మంత్రివర్గ కూర్పులో బండి సంజయ్ కు ఛాన్స్ దక్కుతుందో? లేదో? బుధవారం వరకూ వేచిచూడాల్సి ఉంది.
22 మంత్రులపై వేటు!
బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే రెండు సార్లు అత్యున్నత మీటింగ్ నిర్వహించింది. అయినా కేబినెట్ మార్పులపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అనూహ్యమైన మార్పులు చేయడానికి సిద్ధం కావడం వల్లే ఆలస్యం అవుతోందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మొత్తం 22 మంది కేంద్ర మంత్రులపై వేటు వేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 18న ఎన్డీఏ సమావేశం
మోదీ విదేశీ పర్యటనకు ముందే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇటీవల కొందరు మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేందర్ యాదవ్, కిరెన్ రిజిజుతో సహా పలువురు కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వీరిని మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. పాత మిత్రులను దగ్గరకు చేసుకునేందుకు ప్రయత్ని్స్తోంది. ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన పార్టీలను మళ్లీ కూటమిలోకి ఆహ్వానిస్తోంది. ఈ నెల 18న ఎన్డీఏ సమావేశానికి హాజరుకావాలని పలు ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది.