తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు ఇస్తే.. పరువు తీసిందని కూతురి కాళ్లు నరికేసిన తండ్రి!

Crime news : భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు ఇస్తే.. పరువు తీసిందని కూతురి కాళ్లు నరికేసిన తండ్రి!

Sharath Chitturi HT Telugu

27 July 2024, 9:00 IST

google News
  • Father chops off daughter legs : భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ విడాకులు ఫైల్​ చేసింది. ఆ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి, కుటుంబసభ్యులతో మహిళపై దాడి చేశారు. గొడ్డలితో ఆమె కాళ్లు నరికేశాడు! పాకిస్థాన్​లో జరిగింది ఈ ఘటన.

కూతురి కాళ్లు నరికేసిన తండ్రి- పరువు తీస్తోందని..!
కూతురి కాళ్లు నరికేసిన తండ్రి- పరువు తీస్తోందని..! (AFP/Representational image)

కూతురి కాళ్లు నరికేసిన తండ్రి- పరువు తీస్తోందని..!

పాకిస్థాన్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు ఇవ్వాలని ఓ మహిళ నిర్ణయించుకుంది. కష్ట సమయంలో ఆ మహిళకు అండగా ఉండాల్సిన కుటుంబసభ్యులు, ఆమె కాళ్లు నరికేశారు! పరువు తీస్తోందని ఈ పని చేశారు.

ఇదీ జరిగింది..

పాకిస్థాన్​లోని గుల్​ టౌన్​లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి పేరు సోబియా బతూల్​ షా. కొన్నేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ సోబియాను ఆమె భర్త నిత్యం వేధిస్తూ ఉండేవాడు. చాలా కష్టాలు పెట్టాడు. కుటుంబాన్ని చూసుకునేవాడు కాదు. పిల్లల భారం ఆ మహిళపై పడింది.

ఈ విషయాన్ని ఆ మహిళ అనేక మార్లు తన తండ్రి, కుటుంబసభ్యులకు చెప్పింది. కానీ వారు పట్టించుకోలేదు! అంతేకాదు కష్టకాలంలో అండగా ఉండాల్సిన వారే, తమ పరువు తీసే విధంగా ఏ పనీ చేయొద్దని హెచ్చరించారు.

కానీ భర్త వేధింపులను ఆ మహిళ ఇక భరించలేకపోయింది. భర్త వేధింపుల నుంచి బయటపడాలని నిర్ణయించుకుని విడాకులు ఫైల్​ చేసింది. ఈ వార్త ఆ మహిళ కుటుంబానికి తెలిసింది. వారికి చాలా కోపం వచ్చింది. విడాకుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు.

"మా పరువు తీసింది చాలు. ఇక విడాకులు వెనక్కి తీసుకో. నీ వల్ల మా పరువు పోతోంది," అని మహిళతో తండ్రి అన్నాడు. కానీ ఆ మహిళ వెనక్కి తగ్గలేదు. విడాకులు వెనక్కి తీసుకోలేదు. కూతురిపై తండ్రి సయ్యద్​ ముస్తఫా షా కోపం పెంచుకున్నాడు. సరైన సమయం చూసుకుని ఆమెపై దాడికి ప్లాన్​ చేశారు.

ఇటీవలే సయ్యద్​తో పాటు మహిళ మామలు కుర్బాన్​ షా, ఇన్షా నవాజ్​, ముస్తక్​ షాలు ఆమెను కలిశారు. గొడ్డలితో ఆమె కాళ్లు నరికేశారు. నొప్పితో ఆమె విలవిలలాడినా ఎవరూ పట్టించుకోలేదు. అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని చూసిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ఇక ఎప్పటికీ నడవకపోవచ్చని తెలుస్తోంది.

మరోవైపు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్​ చశారు. ఇతరులను పట్టుకుని మహిళకు న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తుతో పాటు గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్టు వివరించారు.

మరి బాధితురాలి భర్తపై పోలీసులు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా? అన్నది తెలియరాలేదు.

పాకిస్థాన్​లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఇప్పటికే వారు చాలా విధాలుగా వివక్షకు గురవుతున్నారు. ఇక ఆ దేశంలో పరువు హత్యలు, గృహ హింస, వరకట్నం వేధింపులు, బలవంతపు వివాహాలు, వేధింపులు, చిత్రహింసలు, యాసిడ్​ దాడులు, లైంగిక దాడులు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏం చేసినా, ఎన్ని శిక్షలు విధించినా.. ఈ తరహా నేరాలు కొనసాగుతుండటం మరింత ఆందోళనకర విషయం.

తదుపరి వ్యాసం