Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!-warangal police has arrested a man who studied mba and is committing cyber crimes in the name of jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!

Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!

HT Telugu Desk HT Telugu
Jul 06, 2024 06:52 AM IST

Warangal Crime News : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండకు చెందిన ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి అసలు బాగోతం బట్టబయలైంది.

నిందితుడిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు
నిందితుడిని అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు

ఎంబీఏ చదివిన ఓ యువకుడు సాప్ట్ వేర్ ఉద్యోగాల పేరున అమాయకులను బురిడీ కొట్టించాడు. ఇంటర్ నెట్ సాయంతో గ్రాడ్యుయేట్లకు ఫోన్ చేసి అందిన కాడికి దందుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షల్లోనే వసూలు చేశాడు. చివరకు ఓరుగల్లు యువకుడి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. 

సైబర్ టెక్నాలజీ సాయంతో అమాయకులను బోల్తా కొట్టించి రూ.లక్షలు వసూలు చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 28 ఏళ్ల యువకుడిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్స్ ఏసిపి విజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. 

అంద్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరు జిల్లా చట్రాయి మండలం చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన పొనగంటి సాయితేజ కొంతకాలం కిందట ఎంబీఏపూర్తి చేశాడు. ఆ తరువాత తనకున్న బిజినెస్ నాలెడ్జ్ తో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. కానీ కలిసి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అనంతరం నష్టాల నుంచి బయట పడేందుకు సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

వెబ్ సైట్ల నుంచి నిరుద్యోగుల డేటా

ఈజీ మనీ టార్గెట్ పెట్టుకున్న సాయితేజ ఆన్ లైన్ జాబ్ ల పేరున నిరుద్యోగులను బోల్తా కొట్టించడం స్టార్ట్ చేశాడు. ఇందుకు తనకు ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉద్యోగ అవకాశాలు కల్పించే కొన్ని వెబ్ సైట్లను విజిట్ చేశాడు. ఆయా సైట్లలో వివరాలు నమోదు చేసుకున్న నిరుద్యోగుల సమాచారం సేకరించాడు. 

ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలను సేకరించి, వారికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కల్పిస్తానంటూ మెసేజ్లు పంపించేవాడు. ఆ మెసేజ్ లకు స్పందించే నిరుద్యోగులను మెల్లిగా మాటల్లో పెట్టేవాడు. ఇంటర్వ్యూ, పరీక్షలు, ట్రైనింగ్ అని నమ్మించడంతో పాటు వీక్ గా ఉన్నవారికి బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగం కల్పిస్తానంటూ డబ్బులు వసూలు చేయడం, ఆ తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తప్పించుకునేవాడు.

సాయితేజ తన మోసాల్లో భాగంగా కొద్దిరోజుల కిందట హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగికి మెసేజ్ చేశాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు ఎగ్జామ్స్, ట్రైనింగ్ పేరున దాదాపు రూ.3 లక్షల వరు వసూలు చేశాడు. ఆ తరువాత జాబ్ పెట్టిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న సదరు నిరుద్యోగి వరంగల్ కమిషనరేట్ ఆఫీస్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 

దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న సాయితేజను గుర్తించారు. అనంతరం అక్కడికి వెళ్లిని సాయితేజను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.

35 మంది.. రూ.45 లక్షలు

సైబర్ నేరాలకు పాల్పడుతున్న సాయితేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35 మందిని ఉద్యోగాల పేరున బురిడీ కొట్టించినట్లు సాయితేజ ఒప్పుకున్నాడు. వారి నుంచి రూ.45 లక్షల వరకు వసూలు చేసినట్లు అంగీకరించారు. కాగా సాయితేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి నుంచి రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి పంపారు. 

వరంగల్‌ కమిషనరేట్‌లో సైబర్‌ క్రైమ్స్‌ స్టేషన్ ఏర్పాటు చేసిన తరువాత అతి కొద్ది సమయంలో కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ విజయ్‌ కుమార్‌, సీఐ రవి, ఎస్‌ఐలు శివ, చరణ్‌ కానిస్టేబుళ్లు ఆంజనేయులు, మహేందర్‌, రాజు, సంపత్‌లను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner