Anantapur District : ఇంటి స్థలం కోసం గొడవ - అక్కపై గొడ్డలితో దాడి-attack with axe on elder sister for house plot in anantapur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur District : ఇంటి స్థలం కోసం గొడవ - అక్కపై గొడ్డలితో దాడి

Anantapur District : ఇంటి స్థలం కోసం గొడవ - అక్కపై గొడ్డలితో దాడి

HT Telugu Desk HT Telugu
Jul 10, 2024 02:15 PM IST

Anantapur District Crime News: ఇంటి స్థలం వివాదంలో అక్కపై సోదరుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పరిధిలోని గార్లదిన్నె మండలంలో జరిగింది.

అక్కపై గొడ్డలితో దాడి
అక్కపై గొడ్డలితో దాడి (image source from unsplash.com)

అనంతపురం జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఇంటి స్థలం కోసం సొంత అక్క పైనే గొడ్డలితో వేటు వేశాడు. దీంతో ఆవిడకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని పెనకచర్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ‌ఇంటి స్థలం పంపకం విషయమై సొంత అక్క మహబూబి, తమ్ముడు జిలాని బాషా మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ గత కొంతకాలంగా జరుగుతుంది. తరుచూ ఇంటి‌ స్థలం విషయమై ఇద్దరు మధ్య వాగ్వాదం జరుగుతునేది. అయితే మంగళవారం మళ్లీ గొడవ జరిగింది. అది కాస్తా తీవ్రతరం కావడంతో తమ్ముడు జిలాని బాషా అవేశంతో అక్క మహబూబి, ఆమె కుమార్తె షేకున్బిపై గొడ్డలితో దాడి చేశాడు. వారిద్దరూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ తమ్ముడు వెనక్కి తగ్గకుండా వాళ్లపై దాడి చేశాడు.‌

పక్కనే ఉన్న కుటుంబ సభ్యురాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమెను జిలాని భాషా పక్కకు నెట్టి దాడికి ఒడిగట్టాడు. దీంతో తల్లి కూతురిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన తల్లి,‌ కూతురిద్దరిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ‌ హాస్పిటల్ కి తరలించారు. దీంతో మహబూబి, ఆమె కుమార్తె షేకున్బి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తమ్ముడు జిలాని బాషా తమపై గొడ్డలితో దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ గౌస్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.‌ అనంతరం జిలాని భాషాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.‌

అయితే ఈ ఘటనను పక్కింటివాళ్లు ఫోన్లో వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై అనంతపురం ఎస్పీ కార్యాలయం కూడా స్పందించింది. స్థల వివాదంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడి అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ బీవీ శివారెడ్డి తెలిపారు.

"గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో అక్క మహబూబిపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు జిలానిని గార్లదిన్నె పోలీసులు అరెస్టు చేశాం. స్థల విషయంలో అక్క, తమ్ముడిల మధ్య మంగళవారం గొడవ తలెత్తింది. ఇదే విషయంలో తమ్ముడు జిలాని స్వయాన తన అక్క మహబూబిపై గొడ్డలితో దాడి చేశాడు. గాయపడిన అక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి తక్షణమే గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు జిలానిని అరెస్టు చేశారు" అని ఒక ప్రకటనలో తెలిపారు.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

 

WhatsApp channel