Pakistan economic crisis : 5ఏళ్లు- ఏడుగురు ఆర్థిక మంత్రులు.. మారని రాత!
28 February 2023, 12:16 IST
- Pakistan economic crisis : పాకిస్థాన్‌లో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అక్కడ ఐదేళ్లల్లో ఏడుగురు ఆర్థిక మంత్రులు మారారు. కానీ ఫలితం మాత్రం శూన్యం!
5ఏళ్లు- ఏడుగురు ఆర్థిక మంత్రులు.. మారని రాత!
Pakistan economic crisis : ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ దిక్కుతోచని స్థతిలో ఉండిపోతోంది. అటు అప్పులు దొరకక ప్రభుత్వం సతమతమవుతుంటే.. ఇటు అధిక ధరల భారాన్ని మోయలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. 'పరిస్థితులను మారుస్తాం' అంటూ.. గత 5ఏళ్లల్లో ఏడుగురు ఆర్థిక మంత్రులు మారిపోయారు. కానీ అక్కడి ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత దారుణంగా తయారువుతోంది!
వస్తున్నారు.. వెళుతున్నారు..!
Pakistan finance minister : పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని షెహ్బాజ్ షరీఫ్.. గతేడాది అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఆర్థికమంత్రులు మారారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న ఇషక్ దార్.. మిఫ్తాహ్ ఇస్మాయల్ స్థానాన్ని 2022 సెప్టెంబర్‌లో భర్తీ చేశారు. ఇక 2018 ఏప్రిల్‌లో.. మిఫ్తాహ్ ఇస్మాయల్ పాక్ ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేశారు. కానీ రెండు నెలలకే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో.. అదే ఏడాది జూన్‌లో షంషద్ అక్తర్ బాధ్యతలు స్వీకరించారు. అయినా పాక్‌లో పరిస్థితులు మారలేదు! పైగా.. అదే ఏడాదిలో మూడోసారి ఆర్థిక మంత్రిని మార్చింది అప్పటి ప్రభుత్వం. అసద్ ఉమర్.. ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పిటవరకు మరో నలుగురు ఆర్థిక మంత్రులు మారిపోయారు.
Pakistan economic crisis latest updates : "ప్రతిసారి.. కొత్త ఆర్థిక మంత్రి రావడం, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడం, కానీ వారి చర్యలతో అది ఇంకా దారుణంగా తయారవ్వడం.. " ఐదేళ్లుగా పాకిస్థాన్‌లో ఇదే జరుగుతోంది. ఫలితంగా గత వారం పాక్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి (41.45శాతం)ని తాకింది. లీటరు పెట్రోల్ ధర రూ. 272ని తాకింది.
ఐఎంఎఫ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు..!
ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)ని ప్రసన్నం చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటివరకు జరిగిన చర్చలు పెద్దగా ఫలితాల్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ డీల్‌కు తగ్గట్టుగా.. పలు ఆర్థిక అంశాలను మార్చేందుకు పాకిస్థాన్ నిర్ణయించింది. ఎక్సైజ్ సుంకాలు, సేల్స్ ట్యాక్స్ వంటి వాటిని అమాంతం పెంచేసింది. అక్కడి కేంద్ర బ్యాంక్.. వడ్డీ రేట్లను 2శాతం పెంచింది. మార్చ్ 16న జరగనున్న సమావేశంలో మరోమారు వడ్డీ రేట్ల పెంపు అవకాశం ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
Pakistan IMF deal : అయితే.. కష్టకాలంలో పాకిస్థాన్‌కు ఇరాన్, చైనా, ఉజ్బెకిస్థాన్‌లు మద్దతునిస్తున్నాయి. చైనా.. ఇప్పటికే 700 మిలియన్ డాలర్ల నిధులు అప్పుగా ఇచ్చింది. ఇక ఉజ్బెకిస్థాన్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఇరాన్ సైతం ట్రేడ్ పరంగా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.