Pakistani man wants Modi as PM: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆర్థిక సంక్షోభం తో, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాకిస్తాన్ (Pakistan) ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దాంతో వారు ఇప్పుడు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసమర్ధ పాలన వల్లనే పరిస్థితి మరింత దిగజారిందన్న భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ (PM Modi)నే తమకు కూడా ప్రధాన మంత్రిగా ఉంటే బావుంటుందని, ప్రధాని మోదీని తమకు కూడా ప్రధానిగా మార్చమని ఒక వ్యక్తి దేవుడిని కోరుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నరేంద్ర మోదీ (PM Modi) పాకిస్తాన్ (Pakistan) కు కూడా ప్రధానిగా ఉంటే తమకు తక్కువ ధరకే నిత్యావసరాలు లభించేవని ఆ వ్యక్తి ఆ వీడియో (viral video)లో వాపోతున్నాడు.
ప్రస్తుతం పాకిస్తాన్ వీధుల్లో ఒక నినాదం మార్మోగుతోంది. ‘‘ ప్రాణాలతో ఉండాలంటే, పాకిస్తాన్ ను విడిచి పారిపోండి. కావాలంటే భారత్ కైనా వెళ్లండి’’ ('Pakistan se zinda bhago chahe India chale jaao") అనేదే ఆ నినాదం. దానిపై సానా అమ్జాబ్ అనే స్థానిక జర్నలిస్ట్ ఒక వ్యక్తిని ప్రశ్నించగా.. పాకిస్తాన్ లో పుట్టకపోయి ఉంటే బావుండేది’ అని ఆ వ్యక్తి సమాధానిచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
‘‘భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయి ఉండకపోతే బావుండేదనిపిస్తోంది. భారత్ నుంచి విడిపోయి ఉండకపోతే ఇక్కడ కూడా టమాటాలు కిలో రూ. 20కి, చికెన్ కిలో రూ. 150 కి, పెట్రోల లీటర్ రూ. 50కి లభించేది’ అని ఆ వ్యక్తి అనడం ఆ వీడియోలో రికార్డైంది. ‘‘పాకిస్తాన్ కు ఇప్పుడు భుట్లో, షరీఫ్, ఇమ్రాన్, ముషారఫ్.. ఎవరూ అవసరం లేదు. మాకు మోదీ కావాలి. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరింది. పాకిస్తాన్ విడిపోయి ఉండకపోతే, మేం కూడా మోదీ పాలనలో ముందుకు వెళ్లేవాళ్లం’’ అని ఆ యువ పాకిస్తానీ అనడం సంచలనంగా మారింది. ‘‘మోదీ చెడ్డవాడేం కాదు.. ఆయన గొప్పవాడు. ఆయన పాలనలో భారతీయులు చవగ్గా టమాటాలు, చికెన్ కొనగలుగుతున్నారు. మాకు కూడా మోదీని ప్రధానిని చేయమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఆ యువకుడు వ్యాఖ్యానించాడు.