Crime news: 80కి పైగా దళితుల ఇళ్లకు నిప్పు; గ్రామంలో ఉద్రిక్తత; స్పందించిన సీఎం
19 September 2024, 19:42 IST
బిహార్ లోని నవాడాలో దళితుల ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనలో 15 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో ప్రధాన నిందితుడు ప్రాణ్పూర్ గ్రామానికి చెందిన నందు పాశ్వాన్ అని నవాడా ఎస్పీ అభినవ్ ధీమన్ గురువారం తెలిపారు.
80కి పైగా దళితుల ఇళ్లకు నిప్పు
బీహార్ లోని నవాడా జిల్లాలో బుధవారం రాత్రి దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకు చెందిన 80 ఇళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వీటిలో 21 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దాదాపు 100 మందితో కూడిన బృందం కృష్ణా నగర్ ప్రాంతంలోని ఇళ్లను చుట్టుముట్టి నిప్పంటించారు. ఇక్కడ నివసిస్తున్న వారిలో ఎక్కువగా మాంఝీ, రవిదాస్ వర్గాలకు చెందినవారు.
భూ వివాదంతో..
రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దుండగులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత నిందితులు కాల్పులు జరిపారని వారు తెలిపారు. కాల్పుల శబ్దం విన్న ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, పురుషులు తమ పిల్లలతో సహా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తరువాత, గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇళ్లకు నిప్పుపెట్టారు. భూమి వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసు కేసు
సమాచార తెలియగానే, తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని రాత్రి 11.30 గంటల సమయంలో మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) అశుతోష్ కుమార్ వర్మ తెలిపారు. బాధితులకు సత్వరమే పునరావాసం కల్పించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం 21 ఇళ్లు మాత్రమే పూర్తిగా కాలి బూడిదయ్యాయని వర్మ తెలిపారు.
ప్రధాన నిందితుడు పాశ్వాన్
ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రాణ్పూర్ గ్రామానికి చెందిన నందు పాశ్వాన్ తో సహా 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నవాడా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అభినవ్ ధీమన్ గురువారం తెలిపారు. ఈ ఘటన రెండు వర్గాల మధ్య జరిగిన భూ వివాదానికి సంబంధించినదని, ఈ విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
సీఎం స్పందన
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (nitish kumar) రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ)ని సంఘటనా స్థలానికి పంపి దర్యాప్తు చేపట్టాలని కోరారు. యూపీ మాజీ సీఎం మాయావతి, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సహా ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతలు దీనిని ఖండించారు. ‘‘బిహార్ (bihar) లోని నవాడాలో పేద దళితుల ఇళ్లను గూండాలు తగలబెట్టి వారి జీవితాలను నాశనం చేసిన ఘటన చాలా బాధాకరం, తీవ్రమైనది. నిందితులపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధితుల పునరావాసానికి పూర్తి ఆర్థిక సహాయం అందించాలి" అని మాయావతి డిమాండ్ చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారిపై దౌర్జన్యాలను సహించేది లేదని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) కూడా ఈ ఘటనను ఖండిస్తూ దళితుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.