Mayawati : కాంగ్రెస్, బీజేపీ పాలనలో పేదల బతుకులు మారలేదు - మాయావతి
Mayawati : దేశంలో అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించిన ఏకైక పార్టీ బీఎస్పీ అని మాయావతి అన్నారు. కాంగ్రెస్, బీజేపీల పాలనలో పేదల బతుకులు మారలేదని మాయావతి విమర్శించారు.
Mayawati : జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపిలతో తలపడుతూ దేశవ్యాప్తంగా బీఎస్పీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి, వీపీ సింగ్ ప్రభుత్వం మేడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించిన ఘనత బీఎస్పీకే దక్కుతుందన్నారు. ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో బీఎస్పీ పాత్ర కీలకమన్నారు. దేశంలో అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించి సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీనేనన్నారు.
రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టో
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీల పాలనలో పేదల బతుకులు మారలేదని మాయావతి అన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ కు భారతరత్నను ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. దీని కోసం కాంగ్రెస్ పై పోరాడింది తమ పార్టీనేనన్నారు. బీఎస్పీ అధికారంలోకి వేస్తేనే ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు అణగారిన వర్గాలను అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సంపన్న వర్గాల కోసం,సంపన్న వర్గాల చేత నడుపబడుతున్న పార్టీలు బీజేపీ,కాంగ్రెస్ లని ఆరోపించారు. రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రజల విరాళాలతో నడుపబడుతున్న పార్టీ బీఎస్పీయే అన్నారు. మిగిలిన పార్టీలన్నీ ఓట్ల కోసం ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపడుతున్నారని ఆరోపించారు.
బీఎస్పీ అభ్యర్థిపై రాజకీయ కక్షతో దాడి
అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడి ప్రజలను మోసం చేసిందన్నారు మాయావతి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్యపై కొందరు దుండగులు రాజకీయ కక్షతో హత్యాయత్నం చేశారన్నారు. ఆయనకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాయావతి ఆరోపించారు. బహుజన రాజ్యం కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న పార్టీ బీఎస్పీయేనన్నారు. బహుజన మహనీయుల స్ఫూర్తితో బహుజనులందరూ రాజకీయంగా ఒక్కటై ఆధిపత్య పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్నీ దోపిడీ పార్టీలేనన్న మాయావతి బీఎస్పీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు సమానంగా పార్టీ అభ్యర్థులను ప్రకటించిందన్నారు. తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రి చేసేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు.
కేసీఆర్ పాలనలో లక్ష కోట్ల ప్రజా ధనం దోపిడీ - ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సీఎం కేసీఆర్ కుటుంబం1.20 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ 30 శాతం కమీషన్లని అన్నారు. త్యాగాల తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. 1300 మంది విద్యార్థులు అమరులైతే వారి ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఉక్కు మహిళ మాయావతి నాయకత్వంలో పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలపడుతుందని అన్నారు.