train tickets for kids: ఐదేళ్లలోపు పిల్లలకు రైలు ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన
17 August 2022, 17:04 IST
- train tickets for kids: ఐదేళ్ల లోపు చిన్నారులకు టికెట్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
చిన్నారుల టికెట్ బుకింగ్‌లో మార్పులపై రైల్వే శాఖ ప్రకటన (ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీ, ఆగస్టు 17: పిల్లలకు రైలు టికెట్ల బుకింగ్ పాత పద్ధతి ప్రకారమేనని, అందులో ఎలాంటి మార్పులు లేవని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఒకటి నుంచి నాలుగేళ్ల వయస్సు గల పిల్లలకు పెద్దలకు వర్తించే టికెట్ ధరలు వర్తిస్తాయన్న వార్తలు రావడంతో రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది.
2020 మార్చి 6 నాటి రైల్వే మంత్రిత్వ శాఖ సర్క్యులర్ ఒకటి పిల్లలకు రైలు టికెట్లపై గల నిబంధనలు తెలియపరుస్తుంది. ఐదేళ్ల లోపు పిల్లలందరూ రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని సదరు సర్క్యులర్ చెబుతోంది. అయితే ప్రత్యేకంగా బెర్త్ గానీ, సీట్ గానీ కేటాయించడం ఉండదని స్పష్టం చేసింది.
ఒకవేళ ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా బెర్త్ అవసరమైనప్పుడు బెర్త్‌కు అయ్యే టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇలాంటప్పుడు పూర్తిగా, పెద్దలకు వర్తించే టికెట్ ధర వర్తిస్తుంది.
‘ట్రైన్‌లో ప్రయాణం చేసే పిల్లల టికెట్ బుకింగ్ నిబంధనలు మారాయంటూ ఇటీవల మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఒకటి నుంచి నాలుగేళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు టికెట్ అవసరమని ఆ వార్తలు నివేదించాయి. అయితే ఈ వార్తలు తప్పుదోవపట్టించేవిగా ఉన్నాయి. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు తేలేదని భారతీయ రైల్వే స్పష్టం చేస్తోంది..’ అని రైల్వే శాఖ ఒక ప్రకటన జారీచేసింది.
‘ప్రయాణికుల డిమాండ్ మేరకు రైల్వే శాఖ ఒక ఆప్షన్ ఇచ్చింది. ఒక వేళ ఐదేళ్లలోపు వయస్సులో ఉన్న పిల్లలకు బెర్త్ అవసరమైతే బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది. సపరేట్ బెర్త్ అవసరం లేక పోతే వారి ప్రయాణం పూర్తిగా ఉచితం. ఇందులో ఎలాంటి మార్పులేదు..’ అని రైల్వే శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
మీడియాలో వచ్చిన సదరు వార్తలపై ఒక వర్గం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
‘ఏడాది వయస్సున్న పిల్లలు ట్రైన్లలో ప్రయాణిస్తే ఛార్జీలు వసూలు చేస్తోంది. ప్రెగ్నెంట్ మహిళలకు అదనపు టికెట్ వసూలు చేయనందుకు బీజేపీ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాలి..’ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు కనిపించాయి.
‘రైల్వేలు ఇక పేదవాళ్లకు చెందవు. ఇక బీజేపీకి ప్రజలు ఫుల్ టికెట్ కట్ చేస్తారు..’ అని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.