Air quality : 'ప్రాపర్టీ ధరలను వాయు నాణ్యత ఆధారంగా నిర్ణయించాలి'- నితిన్ కామత్ వినూత్న ఆలోచన!
25 November 2024, 12:50 IST
- Nithin Kamath latest news : భారతదేశంలో కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రాపర్టీ ధరలను గాలి- నీటి నాణ్యతతో అనుసంధానించాలని జెరోధాకు సీఈఓ నితిన్ కామత్ ప్రతిపాదించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
వాయు నాణ్యతపై నితిన్ కామత్ విప్లవాత్మక ప్రతిపాదన!
దేశంలో ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యల్లో ‘వాయు నాణ్యత’ ఒకటి! అటు ఉత్తర భారతం, ఇటు దక్షిణ భారతంలో వాయు నాణ్యత క్షీణతకు సంబంధించిన వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయు నాణ్యతను తగ్గించే విధంగా ఒక వినూత్న, విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు జెరోధా కో- ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్. కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి ప్రాపర్టీ ధరలను గాలి- నీటి నాణ్యతతో అనుసంధానించాలని ప్రతిపాదించారు.
ఈ మేరకు ఎక్స్‌లో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు నితిన్ కామత్.
"వాయు కాలుష్యాన్ని మరింత సీరియస్‌గా తీసుకోవడానికి ఏం చేయాలి? అని ఆలోచించాలి. ఈ డేటా 2019 వరకు మాత్రమే కవర్ చేస్తుంది. గత ఐదేళ్లలో పరిస్థితులు మరింత దిగజారాయి," అని భారతదేశంలో వాయు కాలుష్య సంబంధిత మరణాలపై వార్తాపత్రిక క్లిప్పింగ్స్‌ని షేర్ చేస్తూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు జెరోధా సీఈఓ.
"గాలి, నీటి నాణ్యత కోసం ప్రాపర్టీ ప్రైస్ డిస్కౌంట్ దేశంలోని నగరాల్లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలకు పరిష్కారం కావచ్చు,"ని కామత్ అన్నారు.
“ఆర్థిక శాస్త్రం దీనిని పరిగణనలోకి తీసుకుంటే, బహుశా మనమందరం దీనిని గుర్తించేవాళ్లం. ప్రధానంగా గాలి, నీటి నాణ్యత.. ఆస్తి రేటును నిర్ణయించాలి. ఆస్తిని గాలి నాణ్యతతో అనుసంధానం చేయడం వల్ల సదరు ప్రాపర్టీ ఓనర్.. ఆ ప్రాపర్టీకి మాత్రమే కాకుండా, ఆ ప్రదేశానికి యజమాని అవుతాడు,” అని ఆయన సూచించారు.
ఉదాహరణకు తాను జేపీ నగర్ (బెంగళూరు)లో ఓ ప్రాపర్టీని కలిగి ఉంటే, దాన్ని సరిగ్గా చూసుకుంటే, ఆ ప్రాంతం మొత్తం మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది అని నితిన్ కామత్ చెప్పుకొచ్చారు.
ఆ పోస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.
దిల్లీలోని ప్రమాదకరమైన గాలి నాణ్యత దేశం దృష్టిని ఆకర్షిస్తోందని, కానీ వాస్తవానికి ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరుతో సహా భారతదేశంలోని చాలా నగరాల్లో గాలి నాణ్యత బాలేదని ఆయన వాదించారు.
‘పునరాలోచించాల్సిన సమయం’ వచ్చింది..!
నితిన్ కామత్ ఆలోచనలకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. పర్యావరణ హితంగా ఉండే విధంగా ఆర్థిక ప్రోత్సకాలను ఇస్తే, సమాజం బాధ్యతాయుతంగా మారుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా.. కలుషిత గాలి, కలుషిత నీటితో ఆయుష్యు తగ్గింపోతోందని తెలిసినప్పుడు.. రియల్ ఎస్టేట్ వాల్యూ కచ్చితంగా పడిపోతుందని మనం అర్థంచేసుకోవచ్చు," అని ఒక నెటిజన్ రాసుకొచ్చారు.
“కాలుష్య సమస్యలను పరిష్కరించే తదుపరి స్టార్టప్‌పై బెట్ వేయాల్సి ఉంటుంది,” అని మరో యూజర్ రాశారు.
మరి నితిన్ కామత్ ఆలోచనలపై మీరేం అంటారు? ఇది గాలి నాణ్యత సమస్యను పరిష్కరిస్తుందా?