Ajit Pawar latest news : మహారాష్ట్ర ప్రభుత్వానికి అజిత్ పవార్ మద్దతు.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం
02 July 2023, 15:02 IST
- Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామం! ఎన్సీపీ నేత అజిత్ పవార్.. మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వానికి అజిత్ పవార్ మద్దతు..
Ajit Pawar latest news : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు! ఎన్సీపీ అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు గట్టి షాక్. శరద్ పవార్‌పై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బంధువు, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్.. ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయారు. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇంతకాలంగా మహారాష్ట్ర అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజీషన్గా ఉన్న అజిత్ పవార్.. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఫడణవీస్‌తో పాటు ఆయన డిప్యూటీ సీఎం పదవిని పంచుకోనున్నట్టు సమాచారం.
చకచకా జరిగిపోయాయి..
ఎన్సీపీపై అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నట్టు, ఆయన బీజేపీలో చేరనున్నట్టు 2,3 నెలలుగా ఊహాగానాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. బీజేపీలో చేరడంపై అజిత్ పవార్ ఎప్పుడు మాట్లాడలేదు కానీ.. ఎన్సీపీపై అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు.
Maharashtra politics latest news : ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించారు అజిత్ పవార్. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సీనియర్ నేత ఛగన్ భుజ్బాల్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశం జరిగిన కొంత సేపటికే రాజ్ భవన్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. అజిత్ పవార్ నివాసం నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు రావడం, రాజ్ భవన్‌కు చేరుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అజిత్ పవార్ ఆదివారం ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వార్తలు మొదలయ్యాయి. మరోవైపు రాజ్ భవన్‌కు అధికర పక్షంలోని నేతలు సైతం క్యూ కట్టారు.
ఇదీ చూడండి:- Ajit Pawar BJP : 30మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి అజిత్ పవార్? శరద్ పవార్ పార్టీలో చీలిక తప్పదా?
మధ్యాహ్నం నాటికి.. అజిత్ పవార్, సీఎం ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్లు రాజ్ భవన్‌కు చేరుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ పార్టీ పెద్దల సమక్షంలో అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 9మంది ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు పలికారు.
కాగా.. 53మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో అజిత్ పవార్‌కు 43మంది మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్సీపీ సమావేశం..
అజిత్ పవర్ చర్యల నేపథ్యంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం ఓ సమావేశం జరిగింది. తాజా పరిణామాలపై నేతలు చర్చించినట్టు సమచారం.
శరద్ పవార్ స్పందన..
NCP Sharad Pawar : ఆదివారం ఉదయం అజిత్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంపై శరద్ పవార్ స్పందించారు.
"సమావేశం ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అజిత్ పవార్ ఒక లీడర్ ఆఫ్ అపోజీషన్. సమావేశం ఏర్పాటు చేసే అధికారం ఆయనకు ఉంది," అని శరద్ పవార్ అన్నారు.
కాగా.. అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంపై శరద్ పవార్ స్పందించాల్సి ఉంది.
అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు సక్సెస్..!
2019 అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో అధికార బీజేపీకి మెజారిటీ రాలేదు. విభేదాలతో బంధాన్ని తెంచుకుంది శివసేన. చాలా రోజులు గడిచినా ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ తరుణంలో యావత్ దేశానికి షాక్ ఇచ్చారు అజిత్ పవార్! దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. కానీ ఆయన చర్యలు ఎక్కువ రోజులు ఫలితాల్నివ్వలేదు. మెజారిటీ లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం కూలింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.