National Herald Case : 3రోజులు.. 30గంటలు- రాహుల్‌పై ఈడీ సంధించిన ప్రశ్నలేంటి?
17 June 2022, 7:22 IST
- National Herald Case : రాహుల్ గాంధీని 30 గంటల పాటు విచారించిన ఈడీ.. ఏం ప్రశ్నలు సంధించింది? ఆయన జవాబులేంటి?
3రోజులు.. 30గంటలు- రాహుల్‌పై ఈడీ సంధించిన ప్రశ్నలేంటి?
National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని మూడు రోజుల్లో దాదాపు 30గంటల పాటు విచారించింది ఈడీ. సోమవారం మరోమారు విచారణ జరపనుంది. ఈ పరిస్థితులను చూస్తే.. కేసు ఎంత తీవ్రంగా ఉందనేది స్పష్టమవుతోంది. అసలు రాహుల్ గాంధీని ఈడీ అన్ని గంటలు ఎందుకు ప్రశ్నించింది? విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించింది? అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి?
ప్రశ్నలు ఇలా..
2010లో స్థాపించిన యంగ్ ఇండియా సంస్థ ద్వారా మనీలాండరింగ్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ సంస్థకు రాహుల్ గాంధీ డైరక్టర్‌గా ఉన్నారు. సంస్థలో ఆయనకు 38శాతం వాటా కూడా ఉంది. అందుకే యంగ్ ఇండియా చుట్టూనే రాహుల్ గాంధీపై ఈడీ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది.
యంగ్ ఇండియా కార్యకలాపాలపై రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. యంగ్ ఇండియా అనేది ఓ ఎన్జీఓ అని, స్పెషల్ ప్రొవిజనల్ అఫ్ కంపెనీస్ యాక్ట్ కింద సంస్థను ఏర్పాటు చేసినట్టు రాహుల్ వివరించారు. ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ప్రశ్నలకు.. 'ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం చేయలేదు,' అని కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు.
Rahul Gandhi ED : కానీ ఈడీ అధికారులు మాత్రం రాహుల్‌పై ఒత్తిడి పెంచారు. యంగ్ ఇండియా అనేది ఎన్జీఓనే అయితే.. 2010 నుంచి అసలు చారిటీ కార్యకలాపాలు ఎందుకు చేయలేదు? అని ఈడీ నిలదీసింది. యంగ్ ఇండియా తరఫున చారిటీ కార్యకలాపాలు జరిగినట్టు అయితే, అందుకు సంబంధించిన పత్రాలను చూపించాలని స్పష్టం చేసింది.
ఏజేఎల్- యంగ్ ఇండియా మధ్య నడిచిన ఆర్థిక లావాదేవీలపై అవగాహాన ఉందా? అని రాహుల్‌ను ఈడీ అడిగింది. ఏజేఎల్ లావాదేవీల్లో రాహుల్ జోక్యం చేసుకున్నారా? అని కూడా ప్రశ్నించింది.
సంబంధిత వర్గాల ప్రకారం.. విచారణలో భాగంగా ఏజేఎల్, యంగ్ ఇండియాకు చెందిన (రాహుల్ సంతకం చేసిన) డాక్యుమెంట్లను.. ఆయనకు చూపించింది ఈడీ.
సోమవారం మళ్లీ విచారణ..
మూడు రోజుల తర్వాత.. శుక్రవారం కూడా విచారణకు హాజరు కావాలని రాహుల్‌కు చెప్పింది ఈడీ. కానీ.. తన తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కొవిడ్ కారణాలతో ఆసుపత్రిలో ఉన్నట్టు, విచారణకు మరో తేదీన హాజరవుతానని రాహుల్ అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిని అంగీకరించిన ఈడీ.. రాహుల్‌పై నాలుగోసారి విచారణను సోమవారానికి మార్చింది.
అసలేంటి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు?
బ్రిటీష్ రాజ్యంపై యుద్ధం కోసం 1938లో స్థాపించిన వార్తాపత్రికే ఈ నేషనల్ హెరాల్డ్. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ.. ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్(అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్).. నేషనల్ హెరాల్డ్ పత్రికలను ప్రచురించేది.
ఈ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికలో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేరుహోల్డర్లుగా ఉండేవారు.
స్వాతంత్ర్యం తర్వాత.. ఈ నేషనల్ హెరాల్డ్‌ను కాంగ్రెస్ అన్ని విధాలుగా ఉపయోగించుకునేది. అనంతరం.. ఉర్దూ(కౌమి అవాజ్), హిందీ(నవ్‌జీవన్)లోనూ నేషనల్ హెరాల్డ్ ఎదిగింది.
దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నేషనల్ హెరాల్డ్ ఛైర్మన్ పదవి నుంచి నెహ్రూ తప్పుకున్నారు.
క్రమంగా.. దేశంలో నేషనల్ హెరాల్డ్ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరికి 2008లో.. ఈ వార్తాపత్రిక మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు రూ. 90.25కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే.. అప్పులను తొలగించేందుకు.. కాంగ్రెస్ పార్టీ.. నేషనల్ హెరాల్డ్‌కు రూ. 90.25కోట్లు ఇచ్చింది. అది కూడా రుణ రహిత అప్పులు ఇచ్చింది.
యంగ్ ఇండియా లిమిటెడ్ ఏంటి?
Rahul Gandhi ED case : 2009లో యూపీఏ మరోమారు అధికారంలోకి వచ్చింది. 2010లో.. యంగ్ ఇండియా పేరుతో దేశంలో ఓ ఎన్జీఓ ఆవిర్భవించింది.
యంగ్ ఇండియాకు.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డైరక్టర్‌గా ఉండేవారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండేజ్‌లు షేర్‌హోల్డర్ బాధ్యతలు తీసుకున్నారు.
2010లో ఏజేఎల్‌కు 1,057మంది షేర్హోల్డర్లు ఉండేవారు. 2011లో ఒక్కసారిగా.. ఏజేఎల్‌కు చెందిన అన్ని హోల్డింగ్స్‌ను యంగ్ ఇండియాకు బదిలీ చేసేశారు.
ఏజేఎల్.. యంగ్ ఇండియాలో చేరింది. రూ. 90,25కోట్ల రుణం బదులు.. రూ. 50లక్షలను యంగ్ ఇండియాకు చెల్లించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ యంగ్ ఇండియా వశమయ్యాయి.
నేషనల్ హెరాల్డ్ స్కామ్..!
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై 2012లో ఢిల్లీ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి. ఆ తర్వాత.. ఆయన 2013లో బీజేపీలో చేరారు.
నేషనల్ హెరాల్డ్ విషయంలో పెద్ద స్కామ్ జరిగిందని, దీనితో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధం ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.
ఆరోపణలు ఇవే..
యంగ్ ఇండియా షేర్ క్యాపిటల్ రూ. 5లక్షలుగా ఉండేది. కానీ కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీ డోటెక్స్ మెర్చెండైజ్ నుంచి రూ. 1కోటి అప్పు తీసుకుంది. అందులో నుంచి రూ. 50లక్షలు తీసి.. కాంగ్రెస్‌కు ఇచ్చింది.
National Herald scandal : ఆ తర్వాత.. ఏజేఎల్‌ను యంగ్ ఇండియా తన సొంతం చేసుకుంది. ఢిల్లీలోని కీలక రియల్ ఎస్టేట్ ఆస్తుల సహా మరిన్ని నగరాల్లోని నేషనల్ హెరాల్డ్ అస్తులు యంగ్ ఇండియా చేతికి వెళ్లాయి. వీటి విలువ రూ. 2వేల కోట్లు పైమాటే!
కొంత కాలం తర్వాత.. నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చిన రూ. 90.25కోట్ల అప్పును కాంగ్రెస్ మాఫీ చేసింది. అప్పటికే కాంగ్రెస్ చేతిలో యంగ్ ఇండియా ఇచ్చిన రూ. 50లక్షలు ఉన్నాయి.
ఎలాంటి వాణిజ్యపరమైన కార్యకలాపాలు లేని యంగ్ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 800కోట్లు ఆస్తులు ఉన్నాయి. అప్పుల రూపంలో కాంగ్రెస్‌కు రూ. 90.25కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ. 50లక్షలే తీసుకుంది.
కాంగ్రెస్ ఇచ్చిన రూ. 90.25కోట్లు అప్పులు కూడా అక్రమమే అని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. పార్టీ ఫండ్‌లో నుంచి డబ్బులు తీసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చినట్టు చెప్పారు. ఇది ఐటీ చట్టాలకు వ్యతిరేకమని అన్నారు.