ED questions Rahul | రేపు కూడా రావాల్సిందే; రాహుల్‌కు ఈడీ ఆదేశాలు
14 June 2022, 22:38 IST
`నేషనల్ హెరాల్డ్`మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. దాదాపు 10 గంటల విచారణ అనంతరం మర్నాడు కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ ఆయనను ఆదేశించింది.
లంచ్ బ్రేక్ అనంతరం ఈడీ ఆఫీస్‌కు వెళ్తున్న రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వరుసగా మూడో రోజు కూడా హాజరు కానున్నారు. సోమవారం నుంచి వరుసగా ప్రతీరోజు ఈడీ ఆయనను ప్రశ్నిస్తోంది. సోమవారం దాదాపు 11 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 10 గంటలు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
రేపు కూడా రావాలి
మంగళవారం విచారణ అనంతరం, మర్నాడు బుధవారం కూడా విచారణకు రావాలని రాహుల్ గాంధీని ఈడీ అధికారులు కోరారు. దాంతో, వరుసగా, మూడు రోజులపాటు రాహుల్ ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. విచారణను ఈ రోజే ముగించాలని రాహుల్ గాంధీ ఈడీ అధికారులను కోరారు. `ఎంత ఆలస్యమైనా పర్లేదు.. ఈ రోజే ముగించండి` అని అధికారులను కోరారు. కానీ, విచారణ ను మరునాటికి వాయిదా వేసేందుకు ఈడీ అధికారులు నిర్ణయించారు. దాంతో విచారణ మూడో రోజు కూడా కొనసాగనుంది.
ఉదయం 11.30 నుంచి
ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు ఉదయం 11.30 గంటలకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. అప్పటినుంచి మధ్యాహ్నం గంట పాటు ఇచ్చిన బ్రేక్ మినహాయిస్తే.. విరామం లేకుండా రాహుల్ గాంధీ నుంచి ఈడీ అధికారులు వాంగ్మూలం సేకరించారు. దాదాపు 10 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. తన స్టేట్‌మెంట్ కాపీ కావాలని రాహుల్ కోరారని ఈడీ వర్గాలు తెలిపాయి. రాహుల్ ను ఈడీ అధికారులు సుమారు 25 ప్రశ్నలు అడిగారని సమాచారం.
కాంగ్రెస్ నిరసన
ఈడీ విచారణపై కాంగ్రెస్ పార్టీ మండిపడ్తోంది. కేంద్రం విపక్ష నేతలను వేధించడానికి ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీపై ఈడీ కేసు కూడా ఈ కోవలోకే వస్తుందని విమర్శిస్తోంది. రాహుల్ ఈడీ విచారణకు హాజరైన తొలిరోజు నుంచి కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం నిరసనల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల అరెస్ట్
రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించడానికి నిరసనగా కాంగ్రెస్ నేతలు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ ఆఫీస్‌కు నిరసన యాత్ర చేపట్టారు. ఈ యాత్రను అడ్డుకున్న పోలీసులు పార్టీ సీనియర్ నేతలు హరీశ్ రావత్, రణ్‌దీప్ సూర్జెవాలా తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు కొట్టారని, కింద పడేలా నెట్టేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.