ED postpones Rahul's quizzing | రాహుల్ విచారణ సోమవారానికి వాయిదా
`నేషనల్ హెరాల్డ్` మనీ లాండరింగ్ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ గత సోమవారం నుంచి వరుసగా మూడు రోజులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
`నేషనల్ హెరాల్డ్` మనీ లాండరింగ్ కేసులో తన విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను కోరారు. దాంతో విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఈడీ తెలిపింది.
అమ్మ ఆసుపత్రిలో ఉంది..
రాహుల్ గాంధీ అమ్మ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోవిడ్ 19తో బాధపడ్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె కోవిడ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతోంది. అయితే, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈడీకి రాహుల్ గాంధీ వివరించారని, తన తల్లిని చూసుకోవడం కోసం సోమవారం వరకు విచారణను వాయిదా వేయాలని ఈడీని రాహుల్ కోరారు. ఆ అభ్యర్థనను ఈడీ సమ్మతించింది.
దాదాపు 30 గంటలు
గత సోమవారం నుంచి రాహుల్‌ను దాదాపు 30 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల బదిలీ ప్రక్రియ, యంగ్ ఇండియన్ సంస్థ ఏర్పాటు, అందులో మేజర్ స్టేక్ హోల్డర్ల వివరాలు, నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియన్‌ల ఆర్థిక లావాదేవీలపై రాహుల్‌ను లోతుగా, సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఇదే కేసుకు సంబంధించి సోనియా గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, కోవిడ్‌తో బాధపడుతుండడంతో ఆమె ఈడీ ముందు హాజరు కావడానికి సమయం కోరారు.
కాంగ్రెస్ నిరసనలు
రాహుల్ గాంధీని ఈడీ కక్షసాధింపుతోనే విచారణ జరుపుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం అధికారంలో ఉన్న బీజేపీ విధానమని మండిపడ్తోంది. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడం ప్రారంభమైన సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. గురువారం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి.