Nanded hospital news : రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?
03 October 2023, 11:53 IST
- Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71మంది ఆరోగ్య విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?
Nanded hospital news : మహారాష్ట్ర నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మృతుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతోంది. తాజాగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. మొత్తం మీద.. రెండు రోజుల వ్యవధిలో.. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31కి చేరింది.
అసలేం జరుగుతోంది..?
నాందేడ్‌లో డా. శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. సెప్టెంబర్ 30- అక్టోబర్ 1 మధ్యలో ఇక్కడ 24మంది రోగులు మరణించారు. సోమవారం సాయంత్రం ఈ వార్త బయటకు వచ్చింది. 24 గంటల వ్యవధిలో 24మంది రోగులు మరణించడం సంచలనం సృష్టించింది. ఈ 24మందిలో 12మంది పసిబిడ్డలు కావడం అత్యంత ఆందోళకర విషయం. మరో 12మందిలో ఐదుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో నలుగురు.. గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఓ వ్యక్తి విషపూరిత పదార్థం తీసుకోవడంతో ఆసుపత్రిలో చేరాడు. ఒకరికి లివర్ సమస్యలు ఉన్నాయి. ఇద్దరు కిడ్నీ రోగులు ఉన్నారు. మూడు యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి.
Nanded hospital news today : ఇక అక్టోబర్ 1- 2 తేదీల మధ్యలో మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. అంటే.. 48 గంటల్లో 31మంది ప్రాణాలు కోల్పోయినట్టు! మొత్తం 31 మందిలో 16మంది పసికందులు- చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది.
"సెప్టెంబర్ 30- అక్టోబర్ 1 మధ్యలో 24మంది మరణించారు. అక్టోబర్ 1-2 మధ్యలో ఏడుగురు మృతిచెందారు. దయచేసి భయపడకండి. వైద్య నిపుణుల బృందం సిద్ధంగా ఉంది," అని అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ఘటనకు గల కారణాలపై స్పష్టత రావడం లేదు. ఔషధాల కొరత ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. కాగా వీటిని ఆసుపత్రి సిబ్బంది ఖండించింది.
Nanded hospital death toll : "ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వహించలేదు. ఔషధాలు కూడా ఉన్నాయి. చికిత్స ఎంత అందించినా రోగులు రికవర్ అవ్వలేదు," అని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి డీన్ శ్యామ్‌రావ్ వకోడే మీడియాకు తెలిపారు.
నాందేడ్ ఆసుపత్రిలో రోగుల మృతికి సంబంధించిన ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు ప్రభుత్వ అధికారులు చెప్పారు. ముగ్గురు సభ్యుల బృందం దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఓ నివేదిక సమర్పిస్తారని, అందులో కీలక విషయాలు బయటపడతాయని అధికారులు అంటున్నారు.
మరోవైపు.. ఈ ఆసుపత్రిలోని మరో 71 మంది రోగుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రాజకీయ దుమారం..
Maharashtra hospital deaths : మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ స్థాయిలో మరణాలు నమోదవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది. అధికార ఏక్నాథ్ శిందే ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి.
"ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఆగస్ట్‌లో కూడా థానెలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 18మంది రోగులు మరణించారు. అసలేం జరుగుతోంది?" అని మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే!
"పబ్లిసిటీకి వేల కోట్లను ఖర్చుచేస్తుంది బీజేపీ. కానీ చిన్నారుల మందులకు మాత్రం డబ్బులు లేవా?" అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.